ఒక్క సీటు కోసం ఇద్దరు మాజీ ఉపముఖ్యమంత్రుల మద్య యుద్దం
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టిక్కేట్ నాదంటే నాదంటున్నా రాజయ్య, కడియం శ్రీహరి

- , వాళ్ళిద్దరూ అధికార పార్టీ నేతలు… ఒకరు ఎమ్మెల్యే , మరొకరు ఎమ్మెల్సీ… తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రుగా పనిచేసిన వారే. దళిత వర్గానికి చెందిన ఆ ఇద్దరు నేతలకు ఒకరంటే మరొకరికి అస్సలు పడదు. మాటల తూటాలతో గులాబీ గూటిలో కలకలం సృష్టిస్తున్నారు. స్టేషన్ అడ్డాపై చల్లారని మాటల మంటలు హైకమాండ్ కు తలనొప్పిగా మారిందట. సైలెంట్ గా ఉంటే పరిస్థితి చేజారేలా ఉందనే భావనతో చర్యలకు సిద్దమౌతుందట. రాజకీయంగా దుమారం రేపుతున్న ఎవరా నేతలు?. స్టేషన్ ఘన్ పూర్ బిఅర్ ఎస్ లో ముసలం ప్రత్యేక కథనణమపోరాటాల పురిటి గడ్డ ఓరుగల్లులోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో విచిత్ర రాజకీయం నడుస్తుంది. అధికార విపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్ళు ప్రతిసవాళ్ళు ఉంటాయి, కానీ స్టేషన్ ఘనపూర్ లో అధికార పార్టీ టిఆర్ఎస్ నేతల మధ్యనే పొలిటికల్ గా కోల్డ్ వార్ నడుస్తుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య ఇప్పుడు పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయాలు సాగుతున్నాయి. ఒక్కప్పుడు రాజకీయ ప్రత్యర్థులే అయినప్పటికి ప్రస్తుతం అధికార పార్టీ బిఆర్ఎస్ లోనే ఉంటూ అంతర్గత విభేదాలతో రగిలిపోతున్నారు. తుఫాను ముందటి ప్రశాంతతలా సందర్భోచితంగా మాటల తూటాలు పేల్చుతున్నారు..ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల టిక్కెట్ పోరు పై ప్రత్యేక కథనం
ఓరుగల్లు పోరు బిడ్డల మధ్య మాటల మంటలు చల్లారడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజయ్య కడియం శ్రీహరి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది. వారి మధ్య రాజకీయ వైరం దాదాపు మూడేళ్ల క్రితం మొదలైన ఆధిపత్య పోరు రోజురోజుకూ రాజుకుంటోంది. హైకమాండ్ పలుమార్లు కలుగజేసుకుని ఇద్దరు నేతలతో సంప్రదింపులు జరిపినా తాత్కాలికమే అయ్యింది. ఇటీవల స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో షోడషపల్లిలో కేటీఆర్ సభ తర్వాత అంతా సద్దుమణిగిందని అందరూ భావించారు. అయితే ఆదివారం స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఆదేశాలను స్థానిక నాయకత్వం ఖాతరు చేయడంలేదని, ఆత్మీయ సమావేశాల సమాచారం ఇవ్వడం లేదంటూ పరోక్షంగా ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికలప్పుడు, పెద్దపెద్ద సభలు సమావేశాలు ఉన్నప్పుడు తన సహాయం తీసుకుని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆత్మీయ సమ్మేళనాలకు పిలువకపోవడం ఏంటనీ కడియం చేసిన వ్యాఖ్యలు మళ్లీ వివాదాలకు తెరలేపాయి. కడియం వ్యాఖ్యలకు ఘాటుగానే ఎమ్మెల్యే రాజయ్య కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసిఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆదేశానుసారమే ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కడియంను నల్గొండ జిల్లాకు ఇన్ చార్జి గా బాద్యతలు అప్పగించడంతో బిజిగా ఉంటాడనే పిలువలేదన్నారు రాజయ్య. 4న స్టేషన్ ఘనపూర్ లో జరిగే ఆత్మీయ సమావేశానికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇద్దరి మాటలు విన్న తర్వాత కడియం గిచ్చి కయ్యం పెట్టుకున్నట్లు ఉందని పార్టీ శ్రేణులు నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మూడేళ్లుగా ఇద్దరిమద్య ‘స్టేషన్ ఘనపూర్’లో ఆధిపత్యపోరు సాగుతోంది. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలు మొదటి నుంచి రాజకీయ ప్రత్యర్థులే. కడియం శ్రీహరి టీడీపీ నుంచి స్టేషన్ఘన్పూర్లో మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ హయాంలో మంత్రిగా సైతం పని చేశారు. అదేనియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజయ్య తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో రాజయ్య, శ్రీహరి ప్రత్యర్థులుగా పోటీ చేయగా రాజయ్య విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో ఉన్న శ్రీహరి ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. ఇద్దరు ఒకే పార్టీలో కొనసాగుతున్నా.. దాదాపు మూడేళ్లుగా ఆధిపత్యపోరు నడుస్తోంది. 2014 ఎన్నికల తర్వాత తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎం కావడం.. ఆరు నెలల తర్వాత పలు ఆరోపణల నేపథ్యంలో రాజయ్య డిప్యూటీ సీఎం పదవిని పొగొట్టుకోగా, సీఎం కేసీఆర్ కడియం శ్రీహరికి కట్టబెట్టడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. అధిష్టానమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఈ నియామకంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల తర్వాత కేటీఆర్ జోక్యం చేసుకుని రాజయ్య, శ్రీహరిల మధ్య రాజీకుదిర్చారు. అది కూడా కొద్ది రోజులే కాగా.. మూడేళ్లుగా ఈ ఇద్దరు నేతల గ్రూపుల పోరు యధాతథంగా సాగుతుంది.
కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యల వివాదంపై గులాబీ దళపతి సీఎం కేసిఆర్ సీరియస్ గానే ఉన్నాడట. ఇటీవల మంత్రి కేటిఆర్ ను కడియం కలిసిన సమయంలో ఆధిపత్య పోరు గురించి ఆరా తీసి అలా ప్రవర్తించడం పార్టీకి మంచిది కాదని సుతిమెత్తగా మందిలించారనే ప్రచారం సాగుతోంది. తాజా వివాదంతో అధిష్టానం సీరియస్గానే ఆలోచిస్తున్నదన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. ఇద్దరు నేతల మధ్య నెలకొన్న వివాదం మొత్తం పార్టీ ఇమేజ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్కడక్కడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న చిన్నచిన్న విభేదాలకు ‘స్టేషనఘన్పూర్’ పాలిటిక్స్ ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదన్న ఇంటిలిజెన్స్ సూచనలను హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అధిష్టానానికి తలనొప్పిగా మారిన స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలను కట్టడి చేసేందుకు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఇంటలిజెన్స్ రిపోర్టుతో పాటు ఐదుగురు సీనియర్ ప్రజాప్రతినిధులతో ఓ కమిటీ వేసి నివేదిక తెప్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా ఎన్నికల ముందు గ్రూపు రాజకీయాలు అంతర్గత విభేదాలకు చెక్ పెట్టకుంటే పరిస్థితులు తలకిందులయ్యే అవకాశం ఉందనే ఆందోళన గులాబీ శ్రేణుల్లో నెలకొంది. ఆ దిశగా గులాబీ దళపతి త్వరగా చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి
….