ఓరుగల్లు నుండి నిరుద్యోగుల పోరు యుద్దం ప్రారంభించిన బిజెపి
ప్రాణంపోయిన యుద్దం అగదన్న. బండి సంజయ్

వరంగల్
ఎన్నికలు వస్తేనే సీఎం కేసిఆర్ కు ఏపి తెలంగాణ సెంటిమెంట్ గుర్తుకు వస్తుందన్నారు బిజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ఇప్పుడు అదే జరుగుతుందని హన్మకొండ లో జరిగిన నిరుద్యోగ మార్చ్ లో స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై పోరాటాల పురటిగడ్డ ఓరుగల్లు నుంచి బిజెపి పోరు బాటకు శ్రీకారం చుట్టి నిరుద్యోగ మార్చ్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. బండి సంజయ్ నేతృత్వంలో జరిగిన ర్యాలీలో బిజెపి ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రఘునందన్ రావు నిరుద్యోగ మార్చ్ ప్రభుత్వ పతనానికి నాంది కాబోతుందన్నారు. లీకేజీ, లిక్కర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ప్రకటించి మూడు లక్షల ఉద్యోగులు భర్తి చేస్తామని ప్రకటించారు.
పేపర్ లీకేజీ, నిరుద్యోగ సమస్యపై ఓరుగల్లు లో కమలనాథులు కదంతొక్కారు. హన్మకొండ లోని కేయు క్రాస్ రోడ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరుద్యోగ మార్చ్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ర్యాలీలో బిజెపి నాయకులతోపాటు విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మూడు కిలోమీటర్ల దూరం సాగిన ర్యాలీ పోలీసులు భారీ భద్రత కల్పించారు. అంబేద్కర్ చౌరస్తాలో బండి సంజయ్ మాట్లాడుతూ TSPSC పేపర్ లీక్ కేసు పక్కదారి పట్టించేందుకే తనపై టెన్త్ పేపర్ లీకేజీ కేసు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు.
అరెస్ట్ చేస్తే భయపడని, దేశం కోసం ప్రాణమిస్తామన్నారు. న్యాయపరంగా కోట్లాడుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి సెంటిమెంట్ లేదు, మా అత్తమ్మ కర్మలున్నాయని చెబుతున్నా అరెస్ట్ చేశారు, రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి ఉన్నా అరెస్ట్ చేశారని తెలిపారు. దళిత ఉపముఖ్యమంత్రి రాజయ్యపై ఆరోపణలు రాగానే బర్తరఫ్ చేశారు.. ఏతప్పూ చేయకపోయినా ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు. మరి నీ బిడ్డ కవిత, కొడుకు కేటీఆర్ పై ఆరోపణలు వస్తే ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. కేసీఆర్ కుటంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది,
బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు ఆలోచించాలని కోరారు.
బిజేపి నిరుద్యోగ మార్చ్ ని చూస్తే మిలియన్ మార్చ్ గుర్తుకు వస్తుందన్నారు డాక్టర్ లక్ష్మణ్. ఈ మార్చ్ ప్రభుత్వ పతనానికి నాంది కాబోతుందని, లీకేజీ, లిక్కర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు.రాబోయే రోజుల్లో బిజేపి ప్రభుత్వం రావడం ఖాయమని చెప్పిన లక్ష్మణ్, జాబ్ క్యాలెండర్ ప్రకటించి మూడు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.కూట్ల రాయి తీయనోడు ఎట్లా ఆయితీస్తాడట…వరంగల్ లో మూతపడ్డ అజాంజాయీ మిల్లును తెరిపించకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం తీసుకుంటుందట అంటూ ఎద్దేవా చేశారు.
ర్యాలీ ప్రారంభానికి ముందు మాట్లాడిన ఈటల తెలంగాణలో కోటి 4 లక్షల కుటుంబాలు ఉంటే ఒకే కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయని కేసిఆర్ కుటుంబాన్ని విమర్శించారు. కేసిఆర్ దోచుకోవడానికే ఉన్నాడని, ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం గంగలో కలుస్తుందన్నారు. సిట్ పై పోలీసులపై నమ్మకం లేదని, టిఎస్పీఎస్సీ ని ప్రక్షాళన చేసి వెంటనే మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బిజేపి కేసులకు దెబ్బలకు భయపడేది కాదు…కొడుకా ఊత్తే కొట్టుకుపోతావ్..మాజోలికి వస్తే మాడిమసై పోతావని కేసిఆర్ ను హెచ్చరించారు. పోలీసులు ఎవరెవరు ఏం చేస్తున్నారో వారందరి చిట్టా రాస్తున్నాం.. బిజేపి ప్రభుత్వం వచ్చాక వారి లెక్క తేలుస్తామన్నారు.
బిజేపి నిరుద్యోగ మార్చ్ సందర్భంగా ఉదయం కేయు వద్ద టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాని మోడీ దిష్టిబొమ్మ తోపాటు బిజేపి ప్లెక్సీ దగ్దం చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ర్యాలీ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ ముందు బిజెపి కార్యకర్తలు దూసుకురాకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అయినా కొందరు కార్యకర్తలు పోలీస్ కమిషనరేట్ ముందు రోడ్డులో వెళ్ళేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బిజేపి కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుని స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు భారీగా మోహరించి పకడ్బందీ చర్యలు చేపట్టడంతో నిరుద్యోగ మార్చ్ ప్రశాంతంగా ముగిసింది.
….