సాహసాల జాతర… సలేశ్వర జాతర..
శివుని ధర్శనంకోసం నాలుగు కిలోమీటర్లు సాహస యాత్ర చేస్తున్నా భక్తులు

-నింగినుంచి నేలకు దిగుతున్న ఆకాశగంగను తలపించే మహత్తర జలపాతమది. అక్కడి ప్రకృతీ రమణీయత భక్తులను కట్టిపడేస్తోంది.ఎతైన కొండలు,పచ్చని చెట్లు, కొండకొనల నుంచి వచ్చే జలపాతల దృశ్యాలు భక్తులను పరవశింప చేస్తాయి.ప్రకృతి అందాలమద్య నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీప్రాంతంలో వెలసిన సలేశ్వర లింగమయ్య క్షేత్రంలో ఏడాదికి ఒకసారి మాత్రమే సాగే ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఆంధ్రప్రదేశ్,కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వేలాదిగా తరలివస్తున్న భక్తుల శివనామస్మరణతో నల్లమల గుట్టలు మారుమ్రోగుతాయి.అమర్ నాథ్ యాత్రను తలపించే రీతిలో సాగే సలేశ్వర యాత్రపై ప్రత్యేక కథనం
-హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పరహబాద్ చౌరస్తా నుంచి దట్టమైన అటవీలో సుమారు 20 కిలోమీటర్ల దూరంలో లోతైన కొండల మద్య కొలువైన శివలింగాన్ని ఇక్కడి భక్తులు లింగమయ్య స్వామిగా పిలుస్తారు.నల్లమల అటవీ ప్రాంతంలో అనేక శైవక్షేత్రాలు ఉన్నాయి.అందులో సలేశ్వర క్షేత్రానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది.ఇక్కడ కాకతీయుల కాలం నాటి నుంచి ఉత్సవాలు జరుగుతున్నట్టు స్దానికులు చెబతున్నారు. మైదాన ప్రాంతాల్లోని అనేక గ్రామాల నుంచి రైతులు తమ పశువులను నల్లమల అటవీ ప్రాంతానికి మేతకోసం తరలిస్తారు.అక్కడ వాటిని మేపేందుకు వెళ్ళిన చెంచులకు లోయల నడుమ శివుడు కంటబడినట్టు చెబుతున్నారు.
అప్పటినుంచి ప్రతిసంవత్సం చైత్రబహుళ పౌర్ణమిరోజు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది ఏప్రిల్ 5 నుంచి 7వ తేదీవరకు నిర్వహించనున్నారు.గతంలో అయిదురోజులు నిర్వహించే వారు కాని పులులు,వన్య ప్రాణుల సంరక్షణ పేరుతో అటవీశాఖ అధికారులు జాతరను మూడు రోజులకు కుదించారు. దట్టమైన అటవీలో రాళ్ళురప్పల్లో భక్తులు అవస్తలు పడుతూ కాలినడన చంద్రుని పున్నమివెన్నెల్లో శివనామస్మరణచేస్తూ ముందుకు సాగుతారు.
చేతిలో కర్రసహయంతో వస్తున్న..వస్తున్న లింగమయ్య అంటూ భక్తులు అడవిలో యాత్రను సాగిస్తారు.కొన్నేళ్ళ క్రితం వరకు పరహబాద్ నుంచి భక్తులు అటవీలోనడిచి వెళ్లేవారు కాని ప్రస్తుతం అర్టీసి,ప్రైవేటు వాహనాలు 16 కిలోమీటర్ల వరకు పోతున్నాయి.అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు మాత్రం ప్రతిఒక్కరు కాలినడన వెళ్లాల్సిందే.చిన్నపిల్లలనుంచి వృద్దులదాక ఇబ్బందులు పడుతూ నడిచి వెళ్ళేతీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఎతైన కొండలు,పచ్చని చెట్లు,కొండకొనల మద్య పారే జలపాతల దృశ్యాలు భక్తులను పరవశింప చేస్తాయి.నిటారైన లోయలోకి వెళ్తుంటే ఎంతటివారైన కాళ్లు పట్టుకోక తప్పదు.లోయలో ఊటిని తలపించే రీతిలో చల్లదాన్ని ఆస్వాదిస్తారు భక్తులు.కొండల్లో నుంచి జాలువారే జలపాతంలో కొండపైకి పాకుతూ స్నానం ఆచరించి సంతృప్తి చెందుతారు.లోయలో మాత్రం ప్రమాదపుటంచున ప్రయాణం సాగించాల్సి ఉంటుంది.లోతైన లోయలో ఇరుకైన కొండదరుల మద్య ప్రయాణిస్తూ గుహలో వెలసిన లింగమయ్యను దర్శించుకోవటం ఓ సాహసమే.ఎంతో శ్రమతో కాలినడకన ప్రయాణించి లోయలోకి చేరిన భక్తులు కొండదరుల నుంచి వచ్చే జలపాతంలో స్నానమాచరించి కొత్త అనుభూతిని పొందుతారు.ఇక్కడ స్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
-ఏడాదికి ఒకసారి మాత్రమే దర్శన భాగ్యం దొరికే నల్లమల సలేశ్వర లింగమయ్యకోసం భక్తులు ఏడాది పొడవునా ఎదురు చూస్తుంటారు.దట్టమైన అడవీ ప్రాంతంలో కాలినడకన సాగే ఈ యాత్ర ప్రతి భక్తుడికి ఓ మధుర అనుభూతిని మిగుస్తుంది.నల్లమల సమీపంతోని అచ్చంపేట,కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని అనేక గ్రామాల నుంచి భక్తులు చంద్రుడిపున్నమి వెలుగుల్లో వస్తున్న వస్తున్న లింగమయ్య అంటూ యాత్ర సాగిస్తుంటే శబ్దం విన్నప్రతి భక్తుడు ప్రతిగా చేసే శివనామస్మరణతో నల్లమల గిరులు మారుమ్రోగిపోతాయి. వటవర్లపల్లి చౌరస్తా నుంచి వేలాదిగా వచ్చే వాహనాలు,భక్తుల కోలాహలంతో నల్లమల సందడిగా మారుతోంది.ఎప్పుడు బోసిపోయి ఉండే ఆ ప్రాంతం ఏడాదిలోని ఈ మూడు రోజులు మాత్రం బిజిబిజీగా ఉంటుంది.అసలు శివలింగం ఎక్కడో లోతైన లోయలో గుట్టలదరులలో ఉంటుంది.అక్కడికి పోవటం ఓ సహసంగానే చెప్పాలి.లోయకూడ లింగాకృతిలోనే ఉంటుంది.గుట్టల్లో నుంచి వచ్చే జలపాతంలో స్నానమాచరించి లింగమయ్య స్వామికి పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
లోయలో ఊటీని తలపించే వాతావరణం ఉంటుంది.నల్లమల అటవీలో ఉండే రకరకాల వనమూలికల చెట్లను తాకూతూ వచ్చే నీరు జలపాతంగా జాలువారుతుందని అందులో స్నానం అచరిస్తే రోగాలు నయమవుతాయని చెబుతారు.నాగరిక ప్రపంచానికి దూరంగా ఉంటే అడవిబిడ్డలు కేవలం సలేశ్వరంయాత్రా సమయంలోనే బాహ్యప్రపంచంలోని జనాలను చూస్తారు.మొత్తం ప్రయాణంలో నాలుగు కిలోమీటర్ల ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది.ప్రతి ఒక్కరు మోకాళ్ళు పట్టుకుని నడిచే మోకాళ్ల కుర్వ యాత్రలోనే హైలేట్ గా నిలుస్తుంది.ఇక్కడ నడిచిన వారు జీవితంలో కూడ ఈ అనుభూతిని మరిచిపోరు.ఎతైనా కొండలపైనుంచి జాలువారి ఏరుగా ప్రవహించే ముందు సరస్సుగా ఏర్పడి పుష్కర తీర్దం అనే పేరుతో ప్రసిద్ది చెందింది.
ఇక్కడి నీరు మండువేసవిలో సైతం మంచునీటిలా చల్లాగా ఉంటుంది.ఆ నీటిలో స్నానం చేస్తే కలిగే ఆనందానుభూతి అనిర్వచనీయం.ఈ ప్రకృతీ రమణీయ ప్రదేశం ఒకప్పుడు సర్వేశ్వరంగా పిలువబడి ప్రస్తుతం సలేశ్వరంగా ప్రసిద్దిగాంచింది.శైలం అంటే కొండ.కొండలో ఈశ్వరుడున్న ప్రదేశం కావటంతో శైలేశ్వరం అనే పేరుతో కూడ పిలుస్తారు.సెల అంటే జలపాతం కొండవాగు ప్రాంతంలో ఈశ్వరుడున్న ప్రదేశం కావటంతో సలేశ్వరం అనే పేరుతో పిలుస్తున్నారు.
ఈ ప్రాంతంలో సర్వేశ్వర తీర్దం,పుష్కరతీర్దం అనే రెండు ప్రాంతాలు ఉన్నాయి.900 అడుగుల వైశాల్యం గల సలేశ్వర తీర్దానికి పుష్కర తీర్దం నుంచి నీరు చెరుతుంది.ఇక్కడి గుండంలో స్నానాలు చేస్తే చేసిన పాపాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం.35 అడుగుల పొడవు,25 అడుగుల వెడల్పు,20 అడుగుల ఎత్తు ఉన్న కొండగుహలో చెంచుల ఆరాద్య దైవమైన లింగమయ్య స్వామి కొలువుదీరి ఉన్నాడు.క్రీ,శ 6వ శతాబ్దం నాటికే ఇక్కడ లింగం ప్రతిష్టమై ఉన్నట్టు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.ఆలయ ద్వారానికి కుడివైపున వీరభద్రుడు,దక్షుడి విగ్రహాలు ఉన్నాయి,ద్వారానికి ఎడమవైపున రెండు సిద్దగృహలు ఉన్నాయి.ఆలయానికి ముందు బాగంలో 10 అడుగుల కింద సలేశ్వరతీర్దం ఉంది.రెండు కొండల మద్య దరిమీద నడుచుకుంటు జలపాతం వద్దకు వెళ్ళటం అంటే ఓ సహసమే అని చెప్పాలి.ఇంతటి ఇబ్బందికరమైన ప్రయాణం అని తెలిసినా ఇష్టంగా భక్తులు ప్రయాణం సాగిస్తారు. ప్రతి ఏటా భక్తుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.మరోవైపు దారివెంట వెలసిన పెద్దపెద్ద పుట్టలు ఉంటాయి.ఆ పుట్టలకు కుంకుపసుపు పండ్లుపూలతో టెంకాయలు కొట్టి పుట్టలకు దారం చుట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
రవికగుడ్డలు పుట్టలకు చుట్టులో అందులోరాయివేసి ఉయ్యాలలాగ ఊపుతారు అలా చేస్తే సంతానం కలుగుతుందని భక్తులుచెబుతు మరికొందరు భక్తులు అడవిలో దారివెంట ఉండే రాళ్లనుఒకదానిపై ఒకటి నీటారుగా,గుడి ఆకారంలో పేర్చుతారు.కర్రలతో పందిళ్లు వేస్తారు.ఇలా చేస్తే కోరిన కోర్కేలు తీరుతాయని అభిప్రాయపడుతున్నారు. అక్కడికి వచ్చే భక్తులను కదిలిస్తే మాత్రం లింగమయ్య మహిమ గురించి గొప్పగా చెబుతారు.కోర్కెలు తీర్చే దేవుడిగా ఎంతో మేలు చేస్తాడని అంటున్నారు.-
.ఇక్కడికి వచ్చే భక్తులకు కొన్నిస్వచ్చంద సంస్దలు అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశాయి.ఏడాదిలో ఒకసారి మాత్రమే అక్కడికి వాహనాలుగాని,భక్తులను గాని అనుమతిస్తారు.అమర్ నాథ్ యాత్రను తలపించే రీతిలో ఈ సలేశ్వర క్షేత్రం యాత్ర సాగుతుంది.ఇక్కడ వసతులు సరిగా లేకపోవటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇక్కడ చెంచులే పూజలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,మహరాష్ట్ర నుంచి దాదాపు రెండు లక్షలకుపైగా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు.భక్తుల సంఖ్య ప్రతిఏటా పెరుగుతున్నా వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టిసారించటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే జాతరను అటవీశాఖ అధికారులు మూడు రోజులకు కుదించటం అదికూడ ఉదయం 7 గంటల నుంచి నుంచి సాయంత్రం 5 గంటల వరకే వేళ్ళాలనే నిబంధనలు విధించటంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మండుటెండల్లో కాలినడకన ప్రయాణించటం సాధ్యం కాదని రాత్రివేళల్లో పున్నమివెలుగుల్లో ఆహ్లాదంగా వెళ్లటానికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.మరోవైపు జాతరకు వచ్చే భక్తుల వాహనాలకు భారీగా టోల్‌ఫీజు పెంచటంపై మండిపడుతున్నారు.పరోక్షంగా భక్తులు జాతరకు రాకుండా అటవీశాఖ అధికారులు కుట్రపన్నుతున్నారని మండిపడుతున్నారు.చెంచులకు కాకుండా జాతర షాపులను గిరిజనేతులకు కేటాయించి తమకు అన్యాయం చేస్తున్నారని చెంచుసంఘం నేత రాజేంద్ర ప్రసాద్ ఆరోపిస్తున్నారు
—జాతరకు వచ్చే భక్తులు తప్పకుండా అటవీశాఖ నిబంధనలు పాటించాలని డిఎప్ ఓ రోహిత్‌రెడ్డి సూచిస్తున్నారు. ఉత్సవాలలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదించటం జరిగిందని చెప్పారు.అన్నదాన కార్యక్రమాల్లో మంటలు పెట్టడం వల్ల అటవీకాలిపోయే ప్రమాదం ఉందని అలాంటి వారు ముందాస్తు అనుమతి తీసుకుని జాగ్రత్తలు పాటించాలని అన్నారు.రాత్రి వేళల్లో భక్తులు అడవిలో ఉంటే వన్య ప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని అందరు సహకరించాలని ఆయన కోరుతున్నారు.
మొత్తంగా ప్రభుత్వం సలేశ్వరంపై ప్రత్యేక శ్రద్ద చూయిస్తే భవిష్యత్‌లో ఈ క్షేత్రం నల్లమలలోనే కాక తెలంగాణ రాష్ట్రంలోనే ఓ పెద్ద పర్యాటక కేంద్రంగా విరాజిల్లే అవకాశం ఉంది.