స్టేషన్ ఘన్ పూర్ లో ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మద్య టిక్కేట్ యుద్దం
టిక్కేట్ నాదేంటే నాదంటున్నా కడియంశ్రీహరి, ఎమ్మెల్యె రాజయ్య

టిక్కేట్ కోసం యుద్దం… ఆ మాజీ డిప్యూటీ సీఎంలు ఇద్దరు ప్రత్యర్థుల్లా డీ అంటే డీ అంటున్నారు..కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య ఒకరి ఒకరు ఎత్తులు వేసుకుంటున్నారు. పై ఎత్తులు వేసుకుంటున్నారు…స్టేషన్ ఘన్ పూర్ ఎన్నికల. బరిలో నిలిచేదేవరు… స్టేషన్ ఘన్ పూర్ లో మారుతున్నా సమీకరణాల పై ప్రత్యేక కథనం
.
పోరాటాల పురిటి గడ్డ ఓరుగల్లులోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో విచిత్ర రాజకీయం నడుస్తుంది. ఎక్కడైనా అధికార విపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్ళు ప్రతిసవాళ్ళు ఉంటాయి, కానీ స్టేషన్ ఘనపూర్ లో అధికార పార్టీ బిఆర్ఎస్ నేతల మధ్యనే పొలిటికల్ గా కోల్డ్ వార్ నడుస్తుంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన స్టేషన్ ఘనపూర్ కు ఎమ్మెల్యే గా తాటికొండ రాజయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఒక్కప్పుడు రాజకీయ ప్రత్యర్థులే అయినప్పటికి ప్రస్తుతం అధికార పార్టీ బిఆర్ఎస్ లోనే ఉంటూ అంతర్గత విభేదాలతో రగిలిపోతున్నారు. తుఫాను ముందటి ప్రశాంతతలా సందర్భోచితంగా మాటల తూటాలు పేల్చుతున్నారు. ఒకరంటే మరొకరికి అస్సలు గిట్టదు. ఆధిపత్యం కోసం ఆరాటపడుతూ నియోజకవర్గంలో ఎవరికి వారే పర్యటిస్తూ గులాబీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నారు. మాస్టర్ అయిన కడియం శ్రీహరి సంయమనంతో రాజకీయ చక్రం తిప్పుతుండగా రాజయ్య మాత్రం దూకుడుగా వ్యవహరిస్తు అనుచిత వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఇద్దరు కూడా డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. తొలి ఉపముఖ్యమంత్రి గా రాజయ్య ఉండగా ఆయన వ్యవహార శైలితో పదవి పోగొట్టుకోగా అదే ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే కడియం శ్రీహరి తో ఆ పోస్టును భర్తీ చేశారు గులాబీ దళపతి. ఆ పదవి మహాత్యమో ఏమో కానీ ఇద్దరి మధ్య తరుచూ మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంతో కొద్దిరోజుల క్రితం అధిష్టానంచే చివాట్లుతిన్నారు. కొద్దికాలంగా సైలెంట్ గా ఉన్న ఇద్దరు నేతలు చాపకింద నీరులా తమ ప్రతాపం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రూప్ రాజకీయాలు అంతర్గత విభేదాలతో స్వపక్షంలోనే విపక్షంలా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నా కొద్ది స్టేషన్ ఘనపూర్ లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కడియం, నాలుగుసార్లు సార్లు గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న రాజయ్య రాబోయే ఎన్నికల్లో సీటు తనదంటే తనదేనని ప్రచారం చేసుకుంటూ గ్రూప్ రాజకీయాలు నడుపుతున్నారు. వారి మధ్య రాజకీయ వైరం ఏ స్థాయికి వెళ్ళిందంటే స్వంత అన్నదమ్ములు తోటి కోడలు విడిపోయి రెండు వర్గాలుగా మారి కొట్లాడుకునేంత స్థాయికి చేరింది. పరస్పరం ఇద్దరు నేతలు విమర్శలు సంధించుకుంటు పార్టీ శ్రేణులను ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు.
స్టేషన్ ఘనపూర్ టిక్కెట్ నాదే… గెలుపు నాదేనని రాజయ్య స్పష్టం చేస్తున్నారు. కేసిఆర్ నిర్ణయానికి ఆయనకు వీరవిదేయుడు ఎవరంటే తానేనని, త్యాగం చేసిన వ్యక్తిని నీనేనని చెప్పుకొస్తున్నారు. ఏరకంగానైనా, ఎటు నుంచి చూసిన తెలంగాణ లో ముందువరుసలో ఉండేది రాజయ్యనేని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద కులం మాదిగ కులానికి పెద్దమనిషిగా ఉన్నానని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కేసిఆర్ ఆశిస్సులు తనకే ఉంటాయంటున్నారు. అటు కడియం సైతం తానేమి తక్కువ కాదన్నట్లు రాజయ్య తప్పిదాలను వేలెత్తి చూపుతూ తనవర్గాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ సిట్టింగ్‌లకే సీట్లు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో రాజయ్య వర్గం సంబురంగా ఉంటే, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, మచ్చలేని నేత కడియం శ్రీహరికే స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ రాబోతోందని ఆయన వర్గం నేతలు ప్రచారం చేస్తున్నారు. స్వపక్షంలోనే విపక్షం తయారైనట్లుగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయి పనిచేస్తోంది. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుప్రీం అంటూ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి చేసిన సూచనలను రాజయ్య పదే పదే వేదికలపై గుర్తు చేస్తుండగా, ఎమ్మెల్యే రాజయ్యకు ధీటుగా ఎమ్మెల్సీ కడియం నిత్యం నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తుండటం ఘన్‌పూర్ రాజకీయాల్లో ఆధిపత్య పోరు అధికార పార్టీని ఆగమాగం చేస్తోంది.
అధికార పార్టీ పరిస్థితి అలా ఉంటే ఇక విపక్ష పార్టీల పరిస్థితి మరి అధ్వానంగా ఉంది. ఆధిపత్య పోరుతో అధికార పార్టీ కుమ్ములాటకు చెక్ పెట్టేలా విపక్ష పార్టీల్లో సరైన నాయకుడు ఆ ప్రాంతంలో కనిపించడం లేదు. కాంగ్రెస్, బిజేపి లు మినహా అక్కడ మరే ఇతర పార్టీలకు ప్రాతినిధ్యం లేని పరిస్థితి కనిపిస్తోంది. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సింగపురం ఇందిరా రాజయ్యకు గట్టి పోటీ ఇచ్చినప్పటికి ఎన్నికల అనంతరం అడ్రస్ లేకుండా పోయారు. నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదనే అపవాదును మూటగట్టుకుని ఎప్పుడో ఓసారి అలా వచ్చి ఇలా పోతుందనే భావన పార్టీ శ్రేణుల్లోఉంది. ప్రత్యామ్నాయంగా దొమ్మాటి సాంబయ్య అక్కడికి చేరారు. ఇటీవల పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తు క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముచ్చటగా మూడో వ్యక్తి రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామానికి చెందిన డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ పోటీకి ఆసక్తి చూపుతు ఇటీవల రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. డాక్టర్ గా కృష్ణ ఆ ప్రాంత ప్రజలకు సుపరిచితుడే అయిన రాజకీయంగా అంతగా ప్రభావం చూపే పరిస్థితులు కనిపించడం లేదు. సరైన నాయకుడు లేక క్యాడర్ కొట్టుమిట్టాడుతుంటే అటు ఇందిరా ఇటు సాంబయ్య మద్య ఆధిపత్య పోరు అప్పుడే మొదలై పార్టీని మరింత బలహీన పరుస్తుందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సమయంలో 2009లో కాంగ్రెస్ నుంచి రాజయ్య ఎమ్మెల్యే గా గెలుపొందిన చరిత్ర కాంగ్రెస్ కు ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేక పార్టీ పరిస్థితి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెద్దగా ప్రభావం చూపి పరిస్థితి కనిపించడం లేదు.
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పరిస్థితి అలానే ఉంది. 2004లో కాంగ్రెస్ పొత్తుతో అక్కడి నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ విజయరామారావు ప్రస్తుతం బిజేపి లో ఉన్నప్పటికీ స్టేషన్గన్పూర్ నుంచి పోటీకి ఆసక్తి చూపడం లేదు. బిజెపి నుండి ప్రస్తుతం మాదాసు వెంకటేష్ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటున్నాడు. చావులకు బ్రతుకులకు డబ్బుల సాయం చేస్తు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నాడు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్య కుమారుడు బొజ్జపల్లి సుభాష్ గ్రామగ్రామాన యూత్ ను మొబిలైజేషన్ చేసి సీనియర్ లీడర్లను కలుసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తు టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో బిజెపి గట్టి పోటీ ఇవ్వాలంటే ఆ ఇద్దరు నేతలను కాదని మూడో వ్యక్తి కోసం పార్టీ పెద్దలు ప్రయత్నించే అవకాశాలున్నాయి. అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు అంతర్గత విభేదాలను ఆసరా చేసుకుని ఒకరికి గాలం వేసే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.
ఇక స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి విషయానికి వస్తే మూడు అడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఇచ్చిన
100 పడకల ఆసుపత్రి ఇంకా అమలుకు నోచుకోలేదు. మినీ లెదర్ పార్క్, డిగ్రీ కాలేజ్, ఫైర్ స్టేషన్, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్, మున్సిపాలిటీ, స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ ను మిని ట్యాంక్ బండ్ హామీగా మిగిలిపోయాయి. హామీలు నెరవేరకపోగా చేసే అభివృద్ధి పనుల్లో కమిషన్ లు ఎమ్మెల్యే దండుకుంటాడనే అపవాదును మూటగట్టుకున్నాడు. దానికి తోడు గ్రూపు రాజకీయాలతో ప్రజల్లో పలచనవుతున్నాడు. దీంతో ఆయన గ్రాఫ్ తగ్గినా ఆయన మించిన నాయకుడు ఇతర పార్టీలో లేకపోవడం ప్లస్ పాయింట్ గా మారుతుంది. వైయస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధే నియోజకవర్గంలో కనిపిస్తుందనే మాట నిజం అయినప్పటికీ నిత్యం ప్రజల మధ్యనే తిరుగుతూ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంలో ఎమ్మెల్యే రాజయ్య చేస్తున్న ప్రయత్నం ఆయనకు అనుకూలంగా మారుతుందని చెప్పక తప్పదు. అధికార పార్టీలో ఆధిపత్య పోరు, రాజయ్య వ్యవహార శైలి మినహాయిస్తే అక్కడ అధికారం పార్టీదే పైచేయిగా నిలిచే అవకాశాలున్నాయి. కానీ ఎన్నికల నాటికి స్టేషన్ ఘనపూర్ లో రాజకీయ ముఖ చిత్రం మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
….