60 ఏండ్లు నిద్రపోయిన కాంగ్రెస్
బీఆర్ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్

ఆదిలాబాద్ : కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని బీఆర్ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ హెచ్చరించారు. పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ఆర్టీఏ ద్వారా తెలుసుకోవాలని హితవు పలికారు. నిరుద్యోగ యువతను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 60 ఏళ్లపాటు అధికారంలో ఉండి ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకులతో కలిసి ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నారని మండిపడ్డారు. కేజీ టు పీజీ విద్యలో భాగంగా విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్టు గుర్తు చేశారు. వేలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడంతో పాటు ప్రైవేటు రంగంలోనూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నమని స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు మోసిన్, ప్రశాంత్, సాయి, తదితరులు పాల్గొన్నారు.