సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలను పాటించాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.

నార్నూర్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలను పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. శుక్రవారం నార్నూర్ మండల కేంద్రంలో పర్యటించి పల్లె ప్రకృతి వనం, నర్సరీ, సేగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలలో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలను వివరించాలని అధికారులకు సూచించారు. ముందుగా మండల కేంద్రంలోని పల్లె ప్రగతి లో భాగంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాన్ని నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. నర్సరీని పరిశీలించి రాబోయే హరితహారానికి లక్ష్యం మేరకు మొక్కలను పెంచాలని, పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలని, చనిపోయిన మొక్కల స్థానంలో వేరే మొక్కలను నాటి పెంచాలన్నారు. వైకుంఠ ధామాన్ని పరిశీలించి స్నానపు గదులకు డోర్ లను ఏర్పాటు చేసి పూర్తీ వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పాఠశాల సమీపంలో ఉన్న సేగ్రిగేషన్ షెడ్ ను గ్రామా శివారులోని మరో చోటుకు మార్చాలని పంచాయితీ కార్యదర్శిని ఆదేశించారు. ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని అన్నారు. అనంతరం ఏకలవ్య మోడల్, జడ్పీ ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థుల పఠన సామర్త్యం, వసతుల కల్పన వంటి వివరాలను విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సమీపంలోని ఇళ్లకు వెళ్లి బడి ఈడు పిల్లలతో ముచ్చటిస్తూ ప్రతి రోజు పాఠశాలకు వెళ్లాలని సూచించారు. పాఠశాల ప్రహారీగోడను, వీధి కాలువలను నిర్మించాలని పలువురు గ్రామస్తులు కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్, మండల పంచాయతీ అధికారి మహేష్ కుమార్, నాయబ్ తహసీల్దార్ అమృత్ లాల్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.అనంతరం ఉట్నూర్ మండలం లాల్ టెక్డి లోని గ్రూప్ -4 పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి నిర్వహణ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ బోజన్న, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.