సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్

ఆదిలాబాద్ వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో వ్యాపించే మలేరియా, డెంగ్యూ, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను నిరంతరం కొనసాగించాలని సూచించారు. మురుగునీటి కాలువలు, డ్రైనేజీ శుభ్రం చేయించాలని, రహదారులపై వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. బోరు బావుల ఫ్లాట్ ఫాం, వాటర్ ట్యాంకులలో బ్లీచింగ్, యాంటీ లార్వా మందులను స్ప్రే చేయాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, వైద్య, మున్సిపాలిటీ, పంచాయతీ శాఖ అధికారులు ప్రతినిత్యం ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో బహిరంగ మలమూత్ర విసర్జనను నియంత్రించాలన్నారు. ప్రతి ఒక్కరు మరుగుదొడ్లను వినియోగించుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ లలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులు పరిశుభ్రతను పాటించేలా సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఒకటి నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలను వేయాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలు వేయాలని అన్నారు. జిల్లాలో 19 సంవత్సరాల లోపు 1,92,725 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. అందులో అంగన్వాడి కేంద్రాలలో 48 వేల 727 మంది, పాఠశాలలలో 1,26,572 మంది, జూనియర్ కళాశాలలో 14,625 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. మహిళా శిశు సంక్షేమం, విద్యా, వైద్యా శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. నటరాజ్, ఆర్డిఓ రాథోడ్ రమేష్, జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్, జెడ్పి సీఈఓ గణపతి, మున్సిపల్ కమిషనర్ శైలజ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.