విద్య వ్యవస్థను నాశనం చేస్తున్న కేసీఆర్..

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

బెజ్జూర్ ప్రాణహిత నదిపై నిర్మించ తలపెట్టిన తలాయి జల విద్యుత్‌ కేంద్రాన్ని ప్రభుత్వం ఎందుకు నిర్మించడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.”ఓటు మీదే -నోటు మీదే” నినాదంతో పార్టీ సిర్పూర్ ఇంచార్జ్ అర్షద్ హుస్సేన్ చేపట్టిన యాత్ర బెజ్జూర్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం కొనసాగింది. బెజ్జూరు మండలం తలాయి గ్రామ సమీపంలో నిర్మించ తలపెట్టిన జల విద్యుత్‌ కేంద్రం స్థలాన్ని శనివారం ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తలాయి జల విద్యుత్ కేంద్రం నిర్మిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి 15 ఏళ్ళైనా ఇంతవరకు దానికి అతీ గతీ లేదని విమర్శించారు.జల విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు తలాయి వద్ద పుష్కలమైన జల వనరులు ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు నిర్మించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేపడితే జిల్లా అంతటికి విద్యుత్‌ సరిపోయే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో పాలకులు హామీలు ఇవ్వడం తప్ప,ఆచరణకు నోచుకోవడం లేదని విమర్శించారు. జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.జల విద్యుత్ కేంద్రాన్ని తక్షణమే నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కొమురం భీం జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలోని తలాయి జల విద్యుత్ కేంద్రం దానికి అనుసంధానంగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తే ఇక్కడున్న బీడు భూములన్నీ సస్యశ్యామలమవుతాయని తెలిపారు.తెలంగాణ ఏర్పడిన తరువాత ఆదివాసీ, గిరిజన బిడ్డల బతుకులు బాగు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఆదివాసీలకు పోడుపట్టాలు ఇవ్వడంలో, రిజర్వేషన్లు పెంచడంలో బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.బీఎస్పీ అధికారంలోకి వస్తే వెంటనే ఆదివాసి గూడెల్లో ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించే బాధ్యతను కూడా బీఎస్పీ తీసుకుంటుందన్న ఆయన వచ్చే ఎన్నికల్లో అధికార బిఆర్ఎస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.
మన ఊరు-మన బడి నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు?
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ఉద్దేశించిన ‘మన ఊరు – మన బడి’ పథకానికి నిధులు విడుదల చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. “ఓటు మీదే -నోటు మీదే” నినాదంతో బీఎస్పీ పార్టీ సిర్పూర్ ఇంచార్జ్ అర్షద్ హుస్సేన్ చేపట్టిన యాత్ర బెజ్జూర్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం కొనసాగింది. యాత్రలో భాగంగా శిథిలావస్థకు చేరిన కృష్ణపల్లి ప్రభుత్వ పాఠశాలను ఆయన పరిశీలించారు.150 మంది విద్యార్థులన్న పాఠశాలలో సరిపడ టీచర్లు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్న ఆయన విద్యా ప్రమాణాలు పూర్తిగా అడుగంటి పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యా వాలంటీర్ల రద్దు చేసిన ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. మన ఊరు -మనబడి కింద నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో పాఠశాలల్లో ఎక్కడ చూసిన సమస్యలు వెక్కిరిస్తున్నాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. యాత్రలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అర్షద్ హుస్సేన్, జిల్లా ఇంచార్జ్ సిడెం గణపతి, దుర్గం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.