రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా శనివారం మావల మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద నిర్వహించిన రైతుదినోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు జోగు రామన్నతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత మావల గ్రామపంచాయితీ నుండి రైతు వేదిక వరకు ఎడ్లబండ్లపై కలెక్టర్, ఎమ్యెల్యే, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కలెక్టర్, ఎమ్యెల్యేలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ ప్రగతి నివేదికలను అధికారులు సమావేశంలో చవివి వినిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తుందని తెలిపారు. జిల్లాలో రైతుబంధు పథకం ద్వారా 1,47,161 మంది రైతులకు 2363.67 కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. రైతు భీమా పథకం ద్వారా వివిధ కారణాల వలన మరణించిన 3088 మంది రైతులకు 154.4 కోట్ల రూపాయలు వారి నామిని ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, జడ్పీటీసీ వనిత, తహసీల్దార్ ఇమ్రాన్, ఎంపీడీఓ అరుణ, సర్పంచ్ ప్రమీల రాజేశ్వర్, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.