రాష్ట్రపతిని కలిసిన ఉమ్మడి జిల్లా ఆదిమ గిరిజనులు

అదిలాబాద్ :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిమ గిరిజనులైన తోటి తెగకు చెందిన 15 మంది,కొలాం ఆదివాసులు15 మందికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ సహకారంతో ఒక అరుదైన అవకాశం లభించింది.అదిలాబాద్ జిసిడిఓ మెస్రం ఛాయా నేతృత్వంలో ఉమ్మడి జిల్లా నుండి ఢిల్లీ చేరుకున్న ఆదిమ గిరిజనులు ఈనెల12న రాష్ట్రపతి భవన్ సందర్శించి రాష్ట్రపతి తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో ఆదివాసీ గిరిజనులు భేటీ అయి,ఆదిమ గిరిజనుల జీవన విధానం,ఆర్థిక పరిస్థితి,విద్యా విధానం,సంస్కృతి సంప్రదాయాలు,ఆచార వ్యవహారాల పైన రాష్ట్రపతి తో ప్రధానంగా చర్చించారు.పివిటిజి ల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న రాష్ట్రపతి ముర్ము ఆదిమ గిరిజనుల అభివృద్ధికి భారత ప్రభుత్వం గిరిజన మంత్రిత్వ శాఖ ద్వారా ప్రణాళికలను రూపొందించి,పివిటిజి ల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.తదుపరి రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు.అనంతరం రాష్ట్రపతి భవన్ లోని గార్డెన్ సందర్శించి,సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఆమె వెంట రాష్ట్ర గిరిజన కమిషనర్ కార్యాలయం నుండి స్పోర్ట్స్ ఆఫీసర్ జ్యోతి,సూపరిండెంట్ పద్మజ,అధికారులు సుధాకర్,ఉట్నూర్ ఐటిడిఏ అధికారులు ఎస్.రాంబాబు,బి. నాగభూషణం తదితరులు ఉన్నారు.