ముత్నూర్ గ్రామాన్ని ఆదర్శ పంచాయతీ గా తీర్చిదిద్దాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్

ఇంద్రవెల్లి:ముత్నూర్ గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అన్నారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ లో కలెక్టర్ పర్యటించారు. జాతీయ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్- 2023 అవార్డుకు ముత్నూర్ ఎంపికైనందునలో గ్రామంలో మౌలిక వసతుల కల్పనపై పంచాయతీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ముత్నూర్ ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని అన్నారు. మురుగు నీటి కాలువలు, డ్రైనేజి లు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంటిలో మరుగుదొడ్డు నిర్మించాలని, వాటిని వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఇంటి నుండి తడి. పొడి చెత్తను వేరు వేరుగా సేకరించాలని, వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు. అంగన్వాడి, పాఠశాలలలో మరుగుదొడ్లు నిర్మించాలని, భవనాలకు రంగులు వేయాలని సూచించారు. బడి ఈడూ పిల్లలను బడి లో చేర్పించాలని అన్నారు. గ్రామంలోని రోడ్లు, ప్లాట్ల వారిగా నంబర్లను వేయాలని పంచాయతీ అధికారులకు ఆదేశించారు. పచ్చదనం పెంపునకు హరిత హారంలో విరివిగా మొక్కలు నాటాలని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ గ్రామంలో పర్యటించి అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, గ్రామా ముఖ్య కూడళ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో పుష్పలత, తహసీల్దార్ గంగాధర్, పంచాయతీ అధికారి సంతోష్, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.