ప్రారంభమైన ఆషాడ మాసం బోనాలు…

ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని, మ‌హ‌మూద్ అలీ

గోల్కొండ‌లోని శ్రీ జగ‌దాంబిక ఆల‌యంలో తెలంగాణ ఆషాడ బోనాల ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. లంగర్‌హౌస్‌ నుంచి చేపట్టిన అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, మ‌హ‌మూద్ అలీ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. లంగ‌ర్ హౌస్ నుంచి ర‌థం, తొట్టెల ఊరేగింపు ప్రారంభ‌మై గోల్కొండ కోట‌లోని జ‌గ‌దాంబ ఆల‌యం వ‌ర‌కు కొన‌సాగింది. ఉత్స‌వ విగ్ర‌హాల‌కు ఆల‌య క‌మిటీ స‌భ్యులు, ప్ర‌ధానార్చ‌కుల ఇంట్లో ఘ‌నంగా పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ ప్ర‌ముఖ పండుగ‌ల‌లో ఒకటైన బోనాల పండుగ‌ను తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్ర పండుగ‌గా ప్ర‌క‌టించిందన్నారు. బోనాల ఉత్స‌వాల‌కు ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింద‌ని చెప్పారు 2014 నుంచి 2022 వ‌ర‌కు బోనాల నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.78.15 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ నిధుల‌ను ప్ర‌తీ సంవ‌త్స‌రం 3,033 ఆల‌యాల‌కు పంపిణీ చేయ‌డం జ‌రుగుతుందని వెల్ల‌డించారు. బోనాల పండుగ‌కు ముందు తొల‌క‌రి ప‌ల‌క‌రింపు శుభ‌సూచ‌కంగా భావిస్తున్నామ‌న్నారు. అమ్మ‌వారి ఆశీస్సులు రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై ఉండాల‌ని, తెలంగాణ రాష్ట్రం శుభిక్షంగా ఉండాల‌ని అకాంక్షించారు

Leave A Reply

Your email address will not be published.