ప్రశాంత వాతావరణంలో గ్రూప్ – 4 పరీక్షలు నిర్వహించేలా అన్ని చర్యలు

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్

ఆదిలాబాద్‌: ప్రశాంత వాతావరణంలో గ్రూప్ – 4 పరీక్షలు నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అన్నారు. శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 పరీక్షల నిర్వహణపై హైదరాబాదు నుండి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 1 శనివారం నిర్వహించే గ్రూప్- 4 పరీక్షల నిర్వహణ తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై కలెక్టర్లకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గ్రూప్- 4 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, సమావేశాలు నిర్వహించి తీసుకోవలసిన చర్యలపై వారికీ ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో 54 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 17771 మంది అభ్యర్థులు పరీక్షా రాయనున్నారని తెలిపారు. చీఫ్ సూపరిండెంట్లు, లైజన్ అధికారులు, ఇన్విజిలేటర్ల కు శిక్షణలు ఇవ్వడం జరిగిందని అన్నారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు, త్రాగునీరు, వైద్య, భద్రత తదితర అంశాలు ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారము పాటించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఉట్నూర్, ఇచ్చోడ, బోథ్ కేంద్రాల అభ్యర్థులకు ఉదయం ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్ లను నడపనుందని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సందేహాల నివృత్తికి ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఎన్. నటరాజ్, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.