ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్

ఆదిలాబాద్: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా వినూత్న పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నదని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. శుక్రవారం స్థానిక రత్నా గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన సంక్షేమ సంబురాలు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి. ఎస్, స్థానిక శాసన సభ్యులు జోగురామన్నతో కలిసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం జడ్పీ చైర్మన్, కలెక్టర్, ఎమ్యెల్యే లు గొల్ల కుర్మల లబ్ధిదారులకు రెండవ విడత గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిసి, ఎస్సీ, మైనారిటీ, గ్రామీణాభివృద్ధి సంక్షేమ శాఖల అధికారులు జిల్లాలో వారి శాఖల ద్వారా జరిగిన సంక్షేమ, అభివృద్ధి ప్రగతి నివేదికలను సమావేశంలో వివరించారు. జిల్లాలో సంక్షేమ శాఖల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించిన పలువురు లబ్ధిదారులు వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్బంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా ఫించన్, రైతు బంధు, దళిత బంధులాంటి వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు.దశాబ్ది ఉత్సవాల సందర్బంగా నిర్వహించే కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తొమ్మిది సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ వేడుకల సందర్బంగా ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు.