పోతురాజ విన్యాసాల మధ్య బోనమెత్తిన ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్ :పట్టణంలోని ప్రసిద్ధ మారెమ్మ తల్లి ఆలయ 26 వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా చేపట్టారు. స్థానిక శివాజీ చౌక్ లోని మారెమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాలను ప్రతి సంవత్సరం ఘనంగా చేపడుతూ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే గురువారం ఆలయ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవోపేతంగా చేపట్టగా.. ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకల్లో భాగస్వామ్యులయ్యారు. కాలనీ మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనగా… అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆరాధించారు. ముందుగా డప్పు చప్పుల్ల నడుమ మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని శోభయత్రగా ఆలయానికి తరలివచ్చారు. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులతో శివాజీ చౌక్ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలు మంగళ హారతులతో శోభయత్రలో పాల్గొనగా పోతరాజు విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే సైతం బోనాలు నెత్తిన పెట్టుకుని శోభయత్రలో పాల్గొన్నారు. శోభాయాత్ర అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి, పూజలు చేశారు. నైవేద్యం సమర్పించి ప్రత్యేక హారతులు అందచేసి, వేడుకున్నారు. అనంతరం మహాన్నదనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ.. మారెమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. భారి సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటి అధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేపట్టడం పట్ల అభినందనలు తెలియచేశారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా పాడి పంటలతో, సుభిక్షంగా ఉండాలని కోరారు.కార్యక్రమంలో చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆలయ కమిటి అధ్యక్షులు బాదన్ గంగన్న, పట్టణ అధ్యక్షులు అజయ్,కౌన్సిలర్ ప్రకాష్, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, బండారి దేవన్న బాదం గంగన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.