పోడు భూములను సాగు భూములుగా అందిస్తున్నాం

ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్

చెన్నూరు : దశాబ్దాలుగా గిరిజనులు చదును చేసిన పోడు భూములను సాగు భూములుగా మార్చి యాజమాన్య హక్కు కల్పిస్తూ వారికే అందిస్తున్నామని ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. సోమవారం జిల్లాలోని చెన్నూర్ పట్టణంలోని సంతోషిమాత ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి అర్హులైన గిరిజన లబ్దిదారులకు పట్టాలు అందజేశారు. అనంతరం ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాల పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిందని, గిరిజనులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పోడు భూములను సాగు చేసుకున్న అర్హులైన గిరిజనులకు పట్టాలు అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షా 51 వేల 146 మంది పోడు రైతులకు పట్టాలు అందించడం జరుగుతుందని, జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గంలో 666 మంది గిరిజనులకు 1 వేయి 190 ఎకరాల పోడు భూములకు సంబంధించి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.