పల్లె ప్రగతితో ఆదర్శ పంచాయతీ గా అంబుగాం
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.

తాంసి: పల్లె ప్రగతితో నేడు గ్రామాలు పచ్చదనం-పరిశుభ్రతతో ఆదర్శ పంచాయతీ లుగా ప్రాణవిల్లుతున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తాంసి మండలం అంబుగాం గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని కొమురం భీం విగ్రహానికి కలెక్టర్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తొలిసారి గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలుకుతూ, పాదయాత్రతో ఊరేగింపుగా గ్రామపంచాయితీ అవరణలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణానికి బయలుదేరారు. గ్రామ పంచాయితీ అవరణలో సర్పంచ్ తుర్ప బాయి- యశ్వంత్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి గ్రామ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పల్లె ప్రగతి ద్వారా నేడు గ్రామాల స్వరూపాలే మారిపోయాయని, పచ్చదనం-పరిశుభ్రతతో ప్రాణవిల్లుతున్నాయన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత పరిపాలన సౌలభ్యం కొరకు నూతనంగా మరిన్ని గ్రామపంచాయితీలను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా ఏర్పడిన నూతన అంబుగాం గ్రామపంచాయితీకి ఎన్నో అవార్డులు రావడం జరిగిందని, త్వరలో గ్రామపంచాయితీ నూతన కార్యాలయ భవనాన్ని నిర్మించనున్నామని తెలిపారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దెందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భూమయ్య, తహసీల్దార్ శ్రీదేవి, ఏవో రవీందర్, ఎంపీఓ సుధీర్ రెడ్డి, ఎంపీపీ మంజుల రెడ్డి, ఉప సర్పంచ్ జమ్మి బాయి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.