పర్యావరణ పరిరక్షణకు అందరూ మొక్కలు నాటాలి
మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య

లక్షేట్టిపేట్:పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య పిలుపునిచ్చారు. గురువారం గంపలపల్లి లోని 7,8 వార్డులలో హరితహారంలో భాగంగా కాలనీవాసులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే ప్రకృతి నియమాల్లో ముఖ్యమైన చెట్ల పెంపకాన్ని మరువరాదన్నారు. ప్రభుత్వం రూ. కోట్ల బడ్జెట్ వెచ్చించి తెలంగాణలో పచ్చదనం కోసం కృషి చేస్తోందన్నారు. వేసవిలో అధిక వేడికి కారణం అటవీ సంపదలోని భాగమైన వనాలు అంతరించిపోవడమే కారణమన్నారు. అందరూ చెట్ల పెంపకంపై శ్రద్ధ పెట్టాలన్నారు. అనంతరం వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణకు హరితహారంలో భాగంగా మున్సిపాలిటీ లోని ప్రతి వార్డులో మొక్కలు నాటుతున్నామని తెలిపారు.జీవరాశి మనుగడకు పచ్చని చెట్లు ఎంతో అవసరమని వివరించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. అనంతరం ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్ రాందేని వెంకటేష్, నాయకులు తిరుపతి, కిషన్, మున్సిపల్ మేనేజర్ శ్రీహరి, సిబ్బంది పాల్గొన్నారు.