నిరంతరం అప్రమత్తతో విధులు నిర్వర్తించాలి
జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

బేల: జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తతో విధులను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బేలా మండల పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నిర్వహణను, ప్రజల పట్ల పోలీస్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును, పోలీస్ స్టేషన్ పరిసరాలను, పరిశుభ్రతను, రికార్డులను, జిల్లా ఎస్పీ స్వయంగా పోలీస్ స్టేషన్ అంతటా తిరిగి పరిశీలించారు. అదేవిధంగా మహారాష్ట్ర సరిహద్దు కలిగిన పోలీస్ స్టేషన్ కావున నిరంతరం అప్రమత్తతో ఉండి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తుండాలని సూచించారు. ఇతర రాష్ట్రాల గుండా అక్రమంగా అనుమతులకు విరుద్ధంగా ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా సక్రమంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అదేవిధంగా అంతరాష్ట్ర చెక్పోస్ట్ శంకర్గూడ చెక్పోస్ట్ ను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంట జైనథ్ సీఐ కోల నరేష్ కుమార్, ఎస్సై కృష్ణ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.