దివ్యాంగులను చిన్నచూపుచూడడం దుర్మార్గం
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి

ఆదిలాబాద్ః సమస్యలు పరిష్కరించకుండా, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకుండా దివ్యాంగులను చిన్నచూపు చూడడం దుర్మార్గమని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు.ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట జాతీయ వికలాంగ హక్కుల వేదిక ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. శిబిరాన్ని సందర్శించి దివ్యాంగులకు సంఘీభావం ప్రకటించారు. గత 138 రోజులుగా దివ్యాంగులు తమ హక్కులు సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతుంటే అధికారులుగానీ, స్థానిక ఎమ్మెల్యేగానీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఇందుకేనా బంగారు తెలంగాణ తెచ్చుకుంది అంటూ ప్రశ్నించారు. ఇదేనా దివ్యాంగులకు మీరు చేసే న్యాయం అంటూ ఎద్దేవా చేశారు. గొంతెమ్మ కోర్కెలు కోరడంలేదని, వారి న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయడంతోపాటు అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలన్నారు. వారి పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం దిగొచ్చేవరకూ ఆత్మస్థైర్యం కోల్పోకుండా దీక్షలు కొనసాగించాలని, ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న జాతీయ వికలాంగ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఇమ్రాన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా కల్పించారు