తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సాయి చందు పాత్ర మరువలేనిది.
సిద్దిపేట లో ప్రజా సంఘాల నివాళి

సిద్దిపేట: తెలంగాణ ఉద్యమకారుడు ,ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయి చందు హఠాన్మరణంతో మృతి చెందడం విచారకరమని పలు ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్లో విద్యార్థి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సాయి చందు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు పోచబోయిన శ్రీహరి యాదవ్, పి.శంకర్ ,ఎస్.వి. శ్రీకాంత్ లు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో సాయి చందు క్రియాశీలక పాత్ర పోషించాడని, వేలాది వేదికల పైన ప్రత్యేక రాష్ట్ర కాంక్షను రగిలించేలా తన మాటలతో ,ఆటపాటతో ప్రజలందరినీ ఉర్రూతలూగించాడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత రాష్ట్రం చైర్మన్ గా బాధ్యతలునిర్వర్తిస్తూనే అనేక అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభల్లో చురుకుగా పాల్గొని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రచారం చేయడంలో కృషి చేశాడని కొనియాడారు. సాయి చంద్ కులాంతర వివాహం చేసుకొని ఆదర్శప్రాయంగా నిలిచారని తెలిపారు. అతి చిన్న వయసులో గుండెపోటుతో మరణించడం విచారకరమని, తెలంగాణ సమాజం అరుదైన గాయకుణ్ణి, నాయకున్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు ఐలయ్య,ఎల్లన్న,తెలంగాణ మాలమాహనాడు నాయకులు దేవయ్య డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.వినయ్, నాయకులు భీమ్ శేఖర్ ,మాల మహనాడు జిల్లా అధ్యక్షుడు ఎల్లెష్,యండిఎస్ ఎస్ జిల్లా అధ్యక్షుడు కిరణ్ ,తెలంగాణ అంబేద్కర్ సంఘం నేత చిప్పల యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.