చదువుతోనే మంచి భవిష్యత్తు

రిటైర్డ్ కలెక్టర్ శర్మన్ నాయక్

ఇంద్రవెల్లి : చదువుతూనే మంచి భవిష్యత్తు ఉంటుందని రిటైర్డ్ కలెక్టర్ శర్మన్ నాయక్ అన్నారు. నేటి తరం బాగా చదువుకుంటేనే భవిష్యత్తు తరాలు బాగుంటాయని తెలియజేశారు. మంగళవారం హర్కాపూర్ తండా, భీంజి తండా గ్రామాల్లో పర్యటించరు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మమేకమై అక్కడి సాధకబాధకాలను తెలుసుకున్నారు. మీ అందరికీ అండగా ఉండేందుకే ఇక్కడకు వచ్చానని, ఎలాంటి ఇబ్బందులున్నా తనకు సమాచారమిస్తే చాలని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగ రంగాలతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని, పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడికైనా వెళ్తానని, ఎంతకైనా పోరాటం చేస్తానని వాళ్లకు మాట ఇచ్చారు. మహిళలు, యువకులతో ముచ్చటించి గ్రామాలు నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చదువుతోపాటు క్రీడల పట్ల యువకులు ఉత్సాహంగా ఉండాలని, ఆటలు ఆరోగ్యానికి మంచివని శర్మన్ నాయక్ సూచించారు. జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కాలంలోనూ తాను పడ్డ శ్రమను, ఆరోగ్యపరంగా తీసుకున్న జాగ్రత్తలను స్థానికులకు వివరించారు. రెండు గ్రామాల్లోని యువకులకు క్రికెట్, వాలీబాల్ కిట్లు అందించారు. ఇప్పటికీ మంచినీళ్లకు ఇంతగా ఇబ్బందులు పడుతున్నారంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిందేదో జరిగిపోయింది… ఇక నుంచి నేను మీకు అండగా ఉంటా.. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీకు తోడుగా నిలుస్తా అని ఇరు గ్రామాల ప్రజలకు ధైర్యం చెప్పారు. గోండుగూడెం ప్రజల కోసం ఉట్నూరు ఐటీడీఏ పీఓ దగ్గరకు వెళ్లి వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని శర్మన్ నాయక్ అక్కడి వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అచ్చు నాయక్, చౌవన్ లాలు, ప్రకాష్, లింబాజి, యువకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.