గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత

రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

దిలాబాద్ గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నదని, తండాలకు, గుండాలకు పంచాయతీల హోదాతో గిరిజనులకు పాలనాధికారం కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి దేనని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవాని పురస్కరించుకొని ఐటిడిఎ ఆధ్వర్యంలో ఉట్నూర్ హెచ్‌కేజీఎన్ గార్డెన్ లో నిర్వహించిన గిరిజన సంబురాలలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయ నృత్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్ లను మంత్రి, ప్రాజెక్టు అధికారి, శాసన సభ్యులు ప్రారంభించి పరిశీలించారు. అనంతరం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ముందుగా డిడి దిలీప్ కుమార్ గిరిజన సంక్షేమ శాఖ ప్రగతి నివేదిక ను సమావేశంలో వివరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తొమ్మిదేళ్ల పాలనలో గిరిజనుల అస్తిత్వాన్ని గుర్తించి వారి అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోని 362 గిరిజన తండాలు, గోండు గూడాలను స్వయం పరిపాలన కోసం నూతన పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో గిరిజనులే సర్పంచులు, వార్డ్ మెంబర్లుగా ఎన్నికై పాలించుకుంటున్నారని తెలిపారు. నూతన గ్రామ పంచాయతీలకు రూ. 20 లక్షల చొప్పున నిధులతో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. కేస్లాపూర్ నాగోబా జాతర, దర్బార్, కొమురం భీం జయంతి, వర్ధంతిల సభలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సందర్బంగా గిరిజనుల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నామన్నారు. త్వరలోనే పోడు భూములకు పట్టాలను ఇవ్వనున్నామన్నారు. బిసి చేతి కుల వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నామని, అర్హులందరు ఈ నెల 20 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ఉమ్మడి జిల్లాకు 4 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గిరిజనులకు ఆత్మగౌరవం కల్పించే విధంగా ప్రభుత్వం హైదరాబాదులో ఆదివాసీ, బంజారా భవనాలను నిర్మించి ప్రారంభించిదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గిరిజన తండాలు, గుడాలకు రోడ్డు సదుపాయం కల్పించేందుకు 350 కోట్లతో పనులు చేపట్టి జరుగుతున్నాయన్నారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న గిరిజన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అమలవుతోందని గుర్తు చేశారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలనే సంకల్పంతో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో 25 గురుకులాలు, 4 ఏకలవ్య మోడల్ రెసిడెషియల్ పాఠశాలలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఆశ్రమ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం బోధనను అందుబాటులోకి తీసుకురావడం పాటు కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. అలాగే గిరిజన విద్యార్థులు విదేశీ విద్యనభ్యసించేందుకు 20 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని, ఇప్పటి వరకు 10 మంది విద్యార్థులకు 1.83 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. ఆరు శాతానికి పరిమితమైన గిరిజన రిజర్వేషన్ ను జనాభా ప్రాతిపదికన పది శాతానికి పెంచిన ఫలితంగా ఎంతో మంది గిరిజనులకు విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా గిరిజన తండాల్లోని ప్రతి గుడిసె, ప్రతి ఇంటికి ప్రభుత్వం కుళాయిల బిగించి, సురక్షిత మంచినీటిని అందించడంతో అనారోగ్యాల బారిన పడే పరిస్థితి దూరమయ్యిందని అన్నారు. నేడు గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందాయని, గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, విద్యుత్, ప్రాథమిక విద్యా, ప్రాథమిక ఆరోగ్యం వంటి అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. అంతకుముందు ఉట్నూర్ లో 500 లీటర్ల పాలసేకరణ సామర్థ్యం గల డైరీ యూనిట్ ను మంత్రి, శాసన సభ్యులు, ప్రాజెక్టు అధికారి ప్రారంభించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి బాయి, ఆదిమ గిరిజన సలహా మండలి చైర్మన్ కనక లక్కే రావు, అధికారులు, సిబ్బంది, జడ్పీటీసీలు, ఎంపీపీ లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.