ఈనెల 9న కుల వృత్తుల ఆర్థిక సహాయాన్నిలాంచనంగా ప్రారంభించాలి
రాష్ట్ర బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్

ఆదిలాబాద్:బీసి కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించనున్న లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని జూన్ 9న సంక్షేమ సంబురాల సందర్బంగా లాంచనంగా ప్రారంభించాలని రాష్ట్ర బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం హైద్రాబాదు నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా బీసి సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం బీసి కులవృత్తులు, చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయలు అందించేందుకు నిర్ణయించిందని, జూన్ 9న ఈ కార్యక్రమాన్నిరాష్ట్ర ముఖ్యమంత్రి లాంచనంగా ప్రారంభిస్తారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లబ్దిదారులకు ఈ పథకం కింద సహాయం అందించనున్నామని, జూన్ 20 వరకు ఆన్ లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని సూచించారు. స్థానిక ఎమ్యెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, బీసీ కుల వృత్తుల వారికి కుటుంబంలో ఒకరికి చోప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం లక్ష రూపాయలు అందిస్తుందని, దీనిని సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరారు.