ఇరువర్గాల మధ్య భూతగాదాలు
ఘర్షణలో ముగ్గురు మృతి

కొమరం భీం జిల్లా రెబ్బెన మండలం జక్కులపల్లి గ్రామంలో సోమవారం భూతగాదాలతో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది.ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో జక్కులపల్లికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడ్డ వారిని హుటాహుటిన ట్రాక్టర్ లో స్థానిక హాస్పిటల్ తరలించారు.ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ జె.సురేష్ కుమార్ (ఐపిఎస్), ఆసిఫాబాద్ డిఎస్పి శ్రీనివాస్ సందర్శించారు.అనంతరం ఎస్పీ సురేష్ కుమార్ మాట్లాడుతూ రెండు దాయాది కుటుంబాల మధ్య 9 ఎకరాల భూమి విషయంలో గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయని,సోమవారం 12 గంటల ప్రాంతంలో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు వ్యవసాయ పనులు చేస్తుండగా,మరో వర్గానికి చెందిన వ్యక్తులు రావడంతో ఒక్కసారిగా ఘర్షణ జరిగిందన్నారు.ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం కర్రలు,కత్తులు,గొడ్డళ్ళతో దాడి చేసుకున్నారన్నారు.దాడిలో జక్కులపల్లికి చెందిన గురుగల బక్కక్క(60),మంగల్కర్ శంకర్(30)లక్ష్మయ్య చనిపోయారని,గాయపడిన వారిలో చనిపోయిన వర్గం నుండి ఒకరు,ప్రత్యర్థి వర్గం నుండి మరోకరు తీవ్రంగా గాయపడ్డారన్నారు.గ్రామంలో శాంతిభద్రతలను నెలకొల్పడానికి పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.ఎస్పి వెంట ఆసిఫాబాద్ డిఎస్పి శ్రీనివాస్, రెబ్బెన సీఐ అల్లం నరేందర్, రెబ్బెన ఎస్సై ఎల్.భూమేష్,తిర్యాని ఎస్సై రమేష్ తదితరులు ఉన్నారు.