అభివృద్ధిలో ఆదిలాబాదు జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానం
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.

ఆదిలాబాద్: అభివృద్ధిలో ఆదిలాబాదు జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. బుధవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆధ్యాత్మిక దినోత్సవంలో భాగంగా ఆదిలాబాదు పట్టణంలోని మార్వాడి ధర్మశాల, భుక్తాపూర్ మసీదు, తాంసీ మండలం సుంకిడి గ్రామా శివారులోని బుద్ధవిహార్ లలో నిర్వహించిన వేరువేరు కార్యక్రమాలలో కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా మార్వాడి ధర్మశాలలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, స్థానిక శాసన సభ్యులకు వేద పండితులు, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, హోమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న సందర్బంగా జిల్లా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధితో పాటు ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో విరిసిల్లాలని ఆ దేవుళ్ళని కోరుకున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని, జిల్లా ప్రగతికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్బంగా కృతఙ్ఞతలు తెలిపారు. ఆదిలాబాదు శాసన సభ్యులు జోగు రామన్న మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులమతలకాతీతంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర మందిరాల నిర్మాణాలకు, ఆధునీకరణకు ప్రభుత్వం అనేక నిధులు వెచ్చిస్తున్నదని అన్నారు. అనంతరం భుక్తాపూర్ మసీదులో కలెక్టర్, ఎమ్యెల్యేలు ముస్లిం మతపెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమాలలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.