అటవీ హక్కు పత్రాలను అందించిన రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ఉట్నూర్: రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలను ఒక లక్షా 52 వేల కుటుంబాలకు అటవీ హక్కు పత్రాలు కల్పించడం జరుగుతుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉట్నూర్ లోని కే.బి కాంప్లెక్స్ లో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు కేబి కాంప్లెక్స్ లోని కొమురం భీమ్ విగ్రహానికి అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, జల్ , జంగల్, జమీన్ కోసం పోరాటం చేసిన కొమురం భీం ఉద్యమ స్పూర్తితో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులు, గిరిజనేతరులకు అటవీ హక్కు పత్రాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఆదిలాబాదు జిల్లాలో 12222 కుటుంబాలకు 31683 ఎకరాలు, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15254 కుటుంబాలకు 44750 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 2403 కుటుంబాలకు 5024 ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 7253 కుటుంబాలకు 20051 ఎకరాలకు అటవీ హక్కు పాత్రలను పంపిణీచేయడం జరుగుతుందని తెలిపారు. గృహలక్ష్మి పథకం క్రింద 3 లక్షలు, దళిత బందు నియోజకవర్గానికి 1100 యూనిట్ల చొప్పున మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఖానాపూర్ శాసన సభ్యురాలు రేఖ శ్యామ్ నాయక్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లనాటి కలను ప్రభుత్వం నేడు సాకారం చేసిందని అన్నారు. గిరిజనుల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పర్చడం జరుగుతుందని వివరించారు. బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు మాట్లాడుతూ, పోడు పట్టాల పంపిణి కృషి చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అటవీ హక్కులకు చట్టబద్దత కల్పిస్తూ ప్రభుత్వం పోడు వ్యవసాయం చేసుకొనే వారిని సర్వేచేసి అర్హులైన వారికీ పట్టాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 12222 కుటుంబాలకు పోడు పట్టాలను అందజేయడం జరుగుతుందని, నాలుగు రోజులలో పంపిణీని పూర్తిచేసి, రైతు బందు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గిరివికాసం పథకం కింద 600 ఆవాసాలకు త్రీ పేజ్ విద్యుత్ సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను వంద శాతం అమలుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఐటిడిఎ పీవో చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాలకు చెందిన గ్రామ పంచాయతీలకు నేడు పొడు పట్టాలను అందిస్తున్నామని తెలిపారు. ఐటీడీఏ ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అనంతరం మంత్రి, జిల్లా పరిషత్ ఛైర్మెన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యేలు, కలెక్టర్, పీవో, ప్రజాప్రతినిధులు పోడు పట్టాల హక్కు పత్రాలను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి మంత్రి, ప్రజాప్రతినిధులు, వందలాదిమంది గిరిజన రైతులు, ప్రజలు హాజరైనారు. ఈ కార్యక్రమంలో ఆదిమ గిరిజన సలహా మండలి ఛైర్మెన్ కనక లక్కే రావు, తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి భాయి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీజ, డిడి డాక్టర్ దిలీప్ కుమార్, ఎంపీపీ జయవంతరావు, వివిధ మండలాల చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.