అగ్గిరాజేసిన టీపీసీసీ చీప్ రేవంత్ వ్యాఖ్యలు

రేవంత్ పై పోలీస్ స్టేషన్ లలో పిర్యాదు చేసిన బిఅర్ ఎస్ నాయకులు

 

ములుగు జిల్లా

టిపిసిసి చీప్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రగతిభవన్ పై ములుగులో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అగ్గిరగిల్చాయి. రేవంత్ వ్యాఖ్యలపై గులాబీ శ్రేణులు మండిపడుతూ నిరసన ఆందోళనకు దిగారు. దిష్టిబొమ్మల శవయాత్ర నిర్వహించి దగ్దం చేశారు. ములుగు నర్సంపేట పిఎస్ లో ఫిర్యాదు చేసి దేశద్రోహం కింద కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు

 

 

హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ములుగులో జరిగిన సభలో  టీపీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున 10 ఎకరాల్లో రెండు వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రగతి భవన్ లోకి ప్రజలకు ప్రవేశం లేని ఆ భవన్ ఉంటే ఎంత లేకుంటే ఎంతా అంటూ నక్సలైట్లు పేల్చి వేసినా నష్టమే ఉండదన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ద్రోహులు, ఆంధ్ర పెట్టుబడుదారులకు రెడ్ కార్పెట్ పరిచి పంచపక్ష పరమాన్నం పెడుతుంటే తెలంగాణవాళ్ళ కడుపు మండదా అని ప్రశ్నించారు. గడీలను తలపిస్తున్న భవన్ లో పేదోళ్ళకు న్యాయం జరగదని అలాంటి భవన్ ను నక్సలైట్లు బాంబులు పెట్టి పేల్చేసినా ఎవ్వరికి నష్టమే ఉండదన్నారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మండిపడుతున్నారు. సీఎం కేసిఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్ ను నక్సలైట్లు పేల్చివేసినా నష్టమే ఉండదని వ్యాఖ్యానించడం పట్ల నిరసన ఆందోళనలకు దిగారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ములుగు నర్సంపేట పిఎస్ లో రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. సీఎం కెసిఆర్ కు ప్రాణానికి హాని చేసేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి పై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నక్సలైట్లతో జరిగిన లోపాయికారి కుట్రలో బాగంగానే అలా మాట్లాడి ఉంటాడనే అనుమానం వ్యక్తం చేశారు. మాజీ నక్సలైట్ అయిన ఎమ్మెల్యే సీతక్క ఆ వ్యవహారంలో మధ్యవర్తిత్వాన్ని నెరపినట్లుగా తాము భావిస్తున్నామని బిఆర్ఎస్ నాయకులు తెలిపారు. అనుశ్చిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, ఆయనకు సహకరిస్తున్న ఎమ్మెల్యే సీతక్కపై కుట్ర కేసు నమోదుచేసి విచారణ జరిపించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మాటలు దేనికి సంకేతమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. కేసులు సీతక్కకు తనకు కొత్తేమి కాదని స్పష్టం చేశారు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళు పోలీసులను, మధ్యాన్ని, డబ్బులను మాత్రమే నమ్ముకున్నారని విమర్శించారు. తెలంగాణ అనే పదాన్ని అసహ్యించుకున్న వారందరినీ ప్రగతిభవనంలో కూర్చోబెడుతున్నాడు.. దాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. 220 సంవత్సరాలు పాలించిన నిజాం రాజులు పోయారు, గడీలు కూలాయి..నిజాం రాచరికాన్ని బొందపెట్టారని అలాంటి ఉదాహరణలు చరిత్ర ఉన్న ఈ ప్రాంతంలో కెసిఆర్ అథితుడా అని ప్రశ్నించారు. అలాంటిదే జరుగుతుంది.. జరగకుండా ఉండదని స్పష్టం చేశారు.

 

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో బిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో యాత్ర పై ప్రభావం చూపుతుందని పోలీసులు భారీగా మోహరించారు. మహబూబాబాద్ జిల్లాలో సాగుతున్న యాత్ర లో టెన్షన్ వాతవరణం నెలకొంది. యాత్రను అడ్డుకుంటే ప్రతిఘటించేందుకు కాంగ్రెస్ సైతం సిద్ధమవుతుంది.

….

Leave A Reply

Your email address will not be published.