మహిళ సర్పంచ్ ను వేదించిన రాసలీల. ఎమ్మెల్యే రాజయ్య

ఎమ్మెల్యే పై చర్యలు చేపట్టాలని డిమాండ్

 

ఆ ఎమ్మెల్యే రూటే సపరేట్.. ఆయన ఏం చేసినా సంచలనమే. అతని వ్యవహారశైలీ నిత్య వివాదాస్పదం.. మహిళల పట్ల ఎక్కువ మక్కువ చూపి మంత్రి పదవిని పోగొట్టుకున్న ఎమ్మెల్యే, ఇప్పుడు ఓ మహిళ విషయంలో
మరోసారి వార్తల్లోకి ఎక్కారు. చిలిపిచేష్టలతో చిక్కులో పడుతున్న ఎమ్మెల్యే యవ్వారం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. అధికార పార్టీ లో కలకలం రేపుతోంది. ..  ఎమ్మెల్యే    రాజయ్య రాసలీల పై ప్రత్యేక.  కథనం

పోరాటాల పురిటిగడ్డ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో విచిత్ర రాజకీయం నడుస్తుంది. అధికార విపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్ళు ప్రతిసవాళ్ళు ఉంటాయి, కానీ స్టేషన్ ఘనపూర్ లో అధికార పార్టీ బిఆర్ఎస్ నేతల మధ్య పొలిటికల్ కోల్డ్ వార్ నడుస్తుంది. నియోజకవర్గమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళుగా భావిస్తూ ప్రజాసేవకు అంకితమైన ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య యవ్వారం వివాదాస్పదంగా మారుతుంది. నిత్యం వార్తల్లో వ్యక్తిగా ప్రజల నోళ్ళలో నానుతున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తొలి ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. వైద్య వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాల్లో రాణిస్తున్న రాజయ్య మహిళల పట్ల ఆయన చూపే జాలి, ప్రేమ వికటించి అటు పార్టీని ఇటు ప్రజల్ని అయోమయానికి గురి చేస్తుంది.‌ తాజాగా దళిత మహిళా సర్పంచ్ ఎమ్మెల్యే పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ దుమారానికి తెరలేపారు.

 

ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య ఎమ్మెల్యే రాజయ్య పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెప్పినట్లు చేస్తే మంచిది.. లేకుంటే ఆయన సహకార అందించకుండా అణిచివేస్తాడని విమర్శించారు. ఎమ్మెల్యేను కలిసేటప్పుడు మగవాళ్ళు ఉండకూడదని, ఫోటోలు దిగేటప్పుడు అతుక్కుని ఉండాలనే ధోరణితో ఎమ్మెల్యే వ్యవహరిస్తాడని ఆరోపించారు. అలా ఉండకపోవడంతో ఓర్వలేడని తెలిపారు. ధర్మసాగర్ మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసేటప్పుడు దూరంగా ఉంటే అందరి ముందు బొమ్మవా నువ్వు… కష్టపడి రాజకీయాల్లోకి వచ్చావు.. దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదా..రాజకీయాల్లో ఎంజాయ్ చేయాలని ఎమ్మెల్యే రాజయ్య అనడంతో కులపోళ్ళ ముందు ఇజ్జత్ పోయిందని నవ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తోపాటు మండలానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధి, మరో అగ్రవర్ణ నాయకుడు నా బతుకును ఆగం చేయాలని చూశారు.. కానీ ఆగం కాలేదన్నారు. తనను నాశనం చేయాలని చూసిన మహిళను సాటి మహిళగా వారిని నాశనం చేయదలుచుకోలేదని తెలిపారు. తనకు ఎమ్మెల్యే తో పాటు మహిళ ప్రజాప్రతినిధి అగ్రవర్ణ వ్యక్తితో ప్రాణభయం ఉందని తనకు ఏమి జరిగినా ఆ ముగ్గురే బాధ్యులని స్పష్టం చేశారు. వారి నుండి రక్షణ కావాలని కోరుతూ కేసిఆర్ కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో డాక్టర్ రాజయ్యకు టికెట్ ఇవ్వద్దని విజ్ఞప్తి చేశారు. అలాంటి వాళ్ళు ఉంటే ఆరాచకాలు ఉంటాయని, కెసిఆర్ కేటీఆర్ క్రింది స్థాయిలో ఏం జరుగుతుందో చూడండని కోరారు. రాబోయే కాలానికి కాబోయే సీఎం కేటీఆర్ మీ క్రింద పనిచేసే వారి పనితీరును పరిశీలించండని మహిళా సర్పంచ్ నవ్య విజ్ఞప్తి చేయడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది.

మహిళా సర్పంచ్ నవ్య చేసిన విమర్శలు ఆరోపణకు ఆజ్యం పోసేలా రాజయ్య వ్యవహారం ఉంటుంది. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి అయిన రాజయ్య అనతి కాలంలోనే మహిళల పట్ల వ్యవహరించిన తీరుతో మంత్రి పదవి పోగొట్టుకున్నారు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజయ్య మాటలు వ్యవహారశైలి స్త్రీ లోలుడిలా అర్థం వచ్చేలా ఉంటాయి. నియోజకవర్గంలో బర్త్డే సందర్భంగా మహిళ పట్ల వ్యవహరించిన తీరు అప్పట్లో కలకలం సృష్టించింది. ఆ తర్వాత నియోజకవర్గంలో పిల్లలు పుట్టడానికి తన పుణ్యమేనని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మంటపుట్టించాయి. తాజాగా మహిళా సర్పంచ్ ని పట్టుకుని అతుక్కుని ఫోటోలు దిగాలని, రాజకీయాల్లో ఎంజాయ్ చేయాలని సూచించడం, అందుకు అనుగుణంగా ఓ మహిళా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అనుచరురాలు ఎమ్మెల్యేకు సహకరిస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పడం ఎమ్మెల్యే వైఖరిని తేటతెల్లం చేస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మాత్రం రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు అలాంటి విమర్శలు ఆరోపణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిదొంగలు శిఖండి పాత్ర పోషిస్తు తనపై రాజకీయ కుట్ర చేస్తున్నారని, కుట్రలన్నింటిని సీఎం దృష్టికి తీసుకెళ్ళి తిప్పికొడుతానని రాజయ్య స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరవర్గం మహిళలు సైతం సర్పంచ్ నవ్య తీరును తప్పుపడుతూ అనవసరమైన ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. మహిళా విషయంలో వర్గపోరుపై రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

 

 

నిప్పులేనిదే పొగ రాదన్నట్లు కొంత వాస్తవమే అయినప్పటికీ విమర్శల వెనుక అంతర్గత విబేదాలు గ్రూప్ రాజకీయాలే అందుకు కారణం అనే ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా చక్రం తిప్పేందుకు అదృశ్య శక్తులు పావులు కదుపుతున్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు రోజులు ద‌గ్గర ప‌డుతున్నా కొద్ది పొలిటిక‌ల్ హీట్ పెంచుతున్నట్లు తెలుస్తుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య గత కొంత కాలంగా పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయాలు సాగుతున్నాయి. ఒక్కప్పుడు రాజకీయ ప్రత్యర్థులే అయినప్పటికి ప్రస్తుతం అధికార పార్టీ బిఆర్ఎస్ లోనే ఉంటూ అంతర్గత విభేదాలతో రగిలిపోతున్నారు. తుఫాను ముందటి ప్రశాంతతలా  సందర్భోచితంగా మాటల తూటాలు పేల్చుతున్నారు. ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితి లో ఆధిపత్యం కోసం ఆరాటపడుతూ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు. అందులో భాగంగా వైరి వర్గం అంతర్గత కుమ్ములాటలు ఈ రకంగా బయట పడుతున్నాయని ప్రచారం సాగుతుంది. ఇద్దరి మ‌ధ్య మాటల యుద్ధం, ఆధిపత్య పోరు మహిళల వేదికగా తార‌స్థాయికి చేరుకుంటుందనే భావన ప్రజల్లో వ్యక్తమౌతుంది. స్వప‌క్షంలోనే విప‌క్షం త‌యారైన‌ట్లుగా నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయి తమ పరువుతోపాటు పార్టీ పరువు తీస్తున్నారనే ఆందోళన గులాబీ శ్రేణుల్లో నెలకొంది.

బిఆర్ఎస్ జాతీయ పార్టీగా విస్తరిస్తున్న తరుణంలో నేతల మధ్య ఆధిపత్య పోరు, మహిళల పట్ల ఎమ్మెల్యే వైఖరి ఎటు దారితీస్తుందోనని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్ దృష్టి పెట్టాలని కోరుతున్నారు. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు రాజకీయ కోణం దాగిఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టానని స్థానికులు కోరుతున్నారు. గులాబీ దళపతి వేసి చూసే ధోరణి అవలంబించకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
..

Leave A Reply

Your email address will not be published.