సీపీ రంగనాథ్ కు పాలాబిషేకం చేసిన రైతు కుటుంబం

అక్రమార్కుల పై చర్యలు తీసుకోని భూమి రైతుకు అప్పగించిన సీపీ

 

వరంగల్ సిపి రంగనాథ్ అన్నదాతకు అండగా నిలిచారు. తప్పుడు కేసుతో రైతు కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసి భూమిని కాజేయాలని చూసిన గిరిజనులకు చుక్కలు చూపారు.‌ భూమి కోసం బెదిరింపులకు దిగిన 11 మంది పై కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపి రైతుకు న్యాయం చేశారు. సిపి చేసిన మేలుతో అన్నదాత కుటుంబం ఆనందంతో రంగనాథ్ ప్లెక్సీకి పాలభిషేకం చేసి అభిమానాలు చాటుకున్నారు.

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన
రైతు నాడెం వీరస్వామి రాజ్యలక్ష్మి దంపతులకు రెండెకరాల భూమి ఉంది. ఇద్దరు బిడ్డలు గల రైతు దంపతులు కుటుంబ అవసరాల కోసం నాలుగేళ్ళ క్రితం 20 గుంటల భూమిని ఏనుగులతండాకు చెందిన ఎస్ బీ ఐ ఉద్యోగి బానోతు అనిల్ నాయక్ భార్యకు, బానోతు సునీల్ నాయక్ కు విక్రయించారు. కొద్ది రోజుల నుంచి మరో పది గుంటల భూమిని అమ్మాలని అనిల్ నాయక్, సునీల్ నాయక్ రైతు దంపతులపై ఒత్తిడి పెంచారు. భూమిని నమ్ముకుని జీవిస్తున్న రైతు దంపతులు భూమిని అమ్మేందుకు నిరాకరించడంతో బెదిరింపులకు దిగారు. హద్దు రాళ్ళను తొలగించడమే కాకుండా కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విధిలేని పరిస్థితిలో రైతు దంపతులు సిపి రంగనాథ్ ను సంప్రదించి తమకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. రైతు సమస్యను విన్న సిపి రంగనాథ్ వెంటనే సమగ్ర విచారణ జరిపించడంతో గిరిజనుల బండారం బయటపడింది. దీంతో సిపి తప్పుడు ఫిర్యాదుతో రైతును భయభ్రాంతులకు గురి చేస్తున్న సునీల్ నాయక్, అనీల్ నాయక్ తోపాటు 11 మందిపై నర్సంపేటలో కేసులు నమోదు చేయించారు. పుడమి తల్లిని నమ్ముకొని సాగు చేసుకొని బతికే తమకు సీపీ రంగనాథ్ న్యాయం చేశారని రైతు కుటుంబం ఆనందంతో సిపి చిత్రపటం గల ప్లెక్సీ కి పాలాభిషేకం చేశారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అయినట్టు అన్నదాతకు అండగా నిలువడంతో రైతు దంపతులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

సిపి రంగనాథ్ వరంగల్ బాధ్యతలు చేపట్టినప్పటి ప్రజల పక్షాన నిలుస్తు తప్పు చేసిన వారిపై తప్పుడు కేసులతో బెదిరించే వారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే విధి నిర్వహణ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పైరవీలకు ప్రాధాన్యత ఇచ్చే 20 మంది పోలీసులపైనే చర్యలు తీసుకున్నారు. సిపి పనితీరు ప్రశంసిస్తూ ఇటీవల వరంగల్ లో ఓ దివ్యాంగుడు సీపీ ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. సిపి చర్యలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగేడుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.