బాకీ కట్టాలని రైతు ఇంటి తలుపులు తీసుకవెళ్లిన బ్యాంకు అదికారులు

బాకీ కోసం రైతు తలుపులు తీసుకవెళ్లడం వివాదస్పదం

 

మహబూబాబాద్ జిల్లాలో బ్యాంకు అధికారులు దౌర్జన్యానికి దిగారు. గిరిజన రైతు తీసుకున్న అప్పు తీర్చాలని కొడుకు ఇంటి సామగ్రి జప్తు చేసి పరువు తీశారు. బలవంతంగా రైతుల నుంచి అప్పు వసూలు చేయరాదనే నిబంధన ఉన్నప్పటికీ జబర్దస్త్ గా ఇంటి సామాగ్రి జప్తు చేసి రైతు కుటుంబాన్ని ఆందోళన గురిచేయడం కలకలం సృష్టిస్తుంది. బ్యాంక్ అధికారుల తీరుపై డిసిసిబి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో జప్తు చేసిన సామాగ్రి తిరిగి ఇచ్చేశారు‏

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మధనాపురంలో రైతు కుటుంబాన్ని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు ఆందోళనకు గురి చేశారు. రైతు గుగులోతు మోహన్ తనకున్న రెండెకరాల 8 గుంటల భూమిపై 2021లో మార్ట్  గేజ్ లోన్ 4 లక్షల 50 వేలు తీసుకున్నాడు. ఆరు నెలలకు ఒకసారి 60 వేల చొప్పున చెల్లించాలి. ఉపాధి కోసం మోహన్ స్థానికంగా ఉండకుండా హైదరాబాద్ లో ఉంటూ కూలీ పని చేస్తున్నాడు. ఇటీవల అనారోగ్యం పాలు కావడంతో కిస్తీలు చెల్లించడం కాస్త ఆలస్యం కావడంతో బ్యాంకు అధికారులు దౌర్జన్యానికి దిగారు. బ్యాంకు అధికారుల ఒత్తిడితో గత నవంబర్ లో మోహన్ కొడుకు వీరేందర్ 40వేలు చెల్లించాడు. మిగతా డబ్బులు చెల్లించాలని వీరేందర్ ఇంటికి పోలీసులను తీసుకెళ్ళి దౌర్జన్యానికి పాల్పడ్డారు. డబ్బులు చెల్లించకుంటే ఇంటి సామాను జప్తు చేస్తామని ఇంటి తలుపులు, ఇతర సామాగ్రి వాహనంలో వేసి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. అడ్డుకోబోయిన వీరేందర్ భార్యతో బ్యాంకు సిబ్బంది వాగ్వివాదానికి దిగారు.

తండ్రీ అప్పు కోసం తనను ఇబ్బంది పెడుతున్నారని కొడుకు వీరేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. తన మొబైల్ నెంబర్ బ్యాంకుకు లింక్ కావడంతో తనను అప్పు చెల్లించాలని ఇంటి పై దాడి చేసి హోం థియేటర్ ను ధ్వంసం చేస్ డోర్ ను పగల గొట్టారని ఆరోపించాడు. హైదరాబాద్ లో ఉంటున్న మోహన్ ఆరోగ్యం బాగలేక ఇటీవల రెండు కిస్తీలు ఆలస్యం కావడంతో బ్యాంకు మేనేజర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడని రైతు కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుతో తనకు సంబంధం లేకున్నా బ్యాంక్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు వీరేందర్

తండ్రీ అప్పు తీర్చాలని కొడుకు వీరేందర్ ఇంటి సామాగ్రి బ్యాంకు అధికారులు జప్తు చేయడం స్థానికంగా కలకలం సృష్టించి బ్యాంకు చైర్మన్ రవీందర్ రావుదృష్టికి వెళ్ళింది. వెంటనే చైర్మన్ జోక్యం చేసుకుని బ్యాంకు మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో జప్తు చేసిన సామాగ్రి తిరిగి అప్పగించేశారు. రైతుల నుంచి నిర్బంధంగా అప్పులు వసూలు చేయరాదని ఆదేశాలు ఉన్నా బ్యాంకు అధికారులు సామగ్రిని జప్తు చేయడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.