విద్యార్థుల అభ్యాస సామర్ధ్యాలను పెంచండి
ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్ పాయ్

బెజ్జూరు: గిరిజన విద్యార్థుల అభ్యాస సామర్ధ్యాలను పెంచేలా విద్యాబోధన చేయాలని ఐటీడీఏ పీవో చాహత్ బాజ్ పాయ్ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం బెజ్జూరు మండలం సలుగు పల్లి కుంటాల మనేపల్లి ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసి అక్షర జ్యోతి కార్యక్రమం నిర్వహణను పిఓ పరిశీలించారు. ముందుగా స్టోర్ రూమ్ లో రికార్డులను పరిశీలించి, ప్రతిరోజు వివరాలను రిజిస్టరలో నమోదు చేయాలని సూచించారు. వంటగది లో శుభ్రతను, సరుకులు, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం పై ఉపాధ్యాయులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదిలో సబ్జెక్ట్ ల వారీగా విద్యార్థుల సామర్త్యాలను పరీక్షించారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ, గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులలో విద్యా ప్రమాణాల పెంపునకు ఐటిడిఎ ద్వారా అక్షర జ్యోతి కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. కనీస అభ్యాస సామర్థ్యాలకు పెంచేలా విద్యాబోధన చేయాలనీ ఆదేశించారు. ప్రతి పాఠశాలలో వంద శాతం హాజరు నమోదుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాల ప్రాంగణ పరిసరాలను ప్రతి రోజూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు, సిబ్బందికి సుంచించారు.