ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నాం
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్

ఆదిలాబాద్ :ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ లు, రెవెన్యూ అధికారులు, తహసిల్దార్లతో హైదరాబాద్ నుండి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ వీడియో సమావేశం నిర్వహించి జీఓ 58, 59, 76, 118 కింద భూ క్రమబద్దికరణ, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ధరణి లో నూతన ఆప్షన్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ, జీఓ 59 కింద గతంలో వచ్చిన దరఖాస్తులలో 10 లక్షల కంటే అధికంగా చెల్లించాల్సిన 1458 దరఖాస్తుదారులు ఇప్పటి వరకు చెల్లింపులు ప్రారంభించలేదని, వెంటనే వారికి నోటీసులు జారీ చేసి చెల్లింపు చేసేలా చూడాలని సూచించారు. జీఓ 59 కింద లక్ష లోపు చెల్లించాల్సిన 3689 దరఖాస్తుదారులకు సైతం నోటీసు అందించి త్వరితగతిన చెల్లింపు చేసేలా అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వం తక్కువ ధరకు భూ క్రమబద్ధీకరణ చేస్తున్నప్పటికీ అలసత్వం వహించడం సరికాదని, లబ్ధిదారులు ముందుకు వచ్చి చెల్లింపులు ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు. జీఓ 58 కింద గతంలో 20 వేల 668 మంది లబ్ధిదారులకు పట్టాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని, పెండింగ్ లో ఉన్న పట్టాలను రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. భూముల క్రమబద్ధీకరణ కటాఫ్ తేదీని 2 జూన్ 2020 కు పొడిగిస్తూ జీఓ 58, 59 ,76 కింద ప్రభుత్వం మరో మారు దరఖాస్తులను స్వీకరించిందని, వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు బృందాలను ఏర్పాటు చేసి నెలరోజుల వ్యవధిలో క్షేత్రస్థాయి విచారణ ద్వారా అర్హులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు. జీఓ 118 కింద పెండింగ్ ఉన్న దరఖాస్తులు 15 రోజుల పూర్తి చేయాలని అన్నారు. ధరణి కింద పెండింగ్ ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ లకు ఆయన సూచించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఎన్. నటరాజ్, ఆర్డీఓ రాథోడ్ రమేష్, ఏవో అరవింద్ కుమార్, పర్యవేక్షకులు రాజేశ్వర్, స్వాతి, ఈడిఎం రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.