దేశానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్రం

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు

ఆసిఫాబాద్: ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి నిర్మాణాత్మక విలువలతో ఆచరిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా మారిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని కొమరం భీమ్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనంగా నివాళులు అర్పించారు. భారతీయ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం చిల్డ్రన్స్ పార్కులో ఏర్పాటు చేసిన కొట్నాక భీమ్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంలో 25 కోట్ల 90 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించి ఎస్. పి. సురేష్ కుమార్ ను చాంబర్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సముదాయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, డి. జి. పి. అంజన్ కుమార్, రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, శాస్త్రసాంకేతిక, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ కమిషనర్ గణపతి రెడ్డి, ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, ఉట్నూరు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, జిల్లా పరిషత్ చైర్మన్ కోవ లక్ష్మి, శాసనమండలి సభ్యులు దండే విఠల్, సిర్పూర్, ఆసిఫాబాద్, బోథ్, మంచిర్యాల, ఆదిలాబాద్ నియోజకవర్గాల శాసనసభ్యులు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, రాథోడ్ బాపురావు, నడిపెల్లి దివాకర్ రావు, జోగు రామన్నతో కలిసి ప్రారంభించి నూతన కలెక్టరేట్‌ భవనంలో నిర్వహించిన సర్వమత పూజలు, ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలెక్టర్‌ చాంబర్‌లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, అనేక సంస్కరణలతో అన్ని రంగాలలో జరుగుతున్న అభివృద్ధితో దేశంలోని అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షించిన తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా మారిందని అన్నారు. జిల్లాల విభజనతో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేసుకొని ఎంతో అభివృద్ధి సాధించామని, అనేక సంస్కరణలతో ప్రజా సంక్షేమంలో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ సమీకృత కలెక్టరేట్‌ భవనం ద్వారా ఒకే చోట అందిస్తున్నామని, 52.2 కోట్ల రూపాయల వ్యయంతో జిల్లాలో నిర్మించుకున్న సమీకృత కలెక్టరేట్ ను రాష్ట్రంలో 22వ సమీకృత కలెక్టరేట్ భవనంగా ప్రారంభించుకున్నామని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ కేంద్రంగా లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని, పట్టాలు అన్ని మహిళల పేరు మీద అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.