దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.

ఆదిలాబాద్: దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో దివ్యాంగుల సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా పలువురు దివ్యాంగులు మాట్లాడుతూ, వివిధ సమస్యలను కలెక్టర్ కు విన్నవించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన దివ్యాంగులకు అందేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. దివ్యాంగులకు రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. గ్రూప్- 2, 3, లకు స్టడీ సర్కిల్ ల ద్వారా శిక్షణ అందిస్తున్నామని, అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దళితబంధు, బిసి కులవృత్తుల రుణాలు, మైనారిటీ శాఖ ద్వారా అందించే రుణాల మంజూరు ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధలు ప్రకారం అందించడం జరుగుతుందని అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన దివ్యాంగులకు రుణాల మంజూరుకై చర్యలు తీసుకోవాలని మెప్మా, పరిశ్రమలు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. రిమ్స్ ఆసుపత్రిలో, ఏ ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగాల ఎంపికలో వికలాంగుల కోటను అమలు చేయాలనీ, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీలో రోస్టర్ పాయింట్ ప్రకారం ఎంపిక చేయాలనీ అధికారులను ఆదేశించారు. సదరం క్యాంపులను నిర్వహించి అర్హులైన దివ్యంగులకు సర్టిఫికెట్ లను అందజేయాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగుల సౌకర్యార్థం ర్యాంపును ఏర్పాటు చేయాలనీ ఈ సందర్బంగా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి మిల్కా, జిల్లా మైనారిటి సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, వివిధ శాఖల అధికారులు, దివ్యాంగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.