అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.

ఆదిలాబాద్: ఈ నెల 15 లోగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. ప్రత్యేక ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో కలిసి కలెక్టర్ బైక్ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. ఈ బైక్ ర్యాలీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి ప్రారంభమై కొమురం భీం చౌక్, ఎన్టీఆర్ చౌక్, నేతాజీ చౌక్, వినాయక్ చౌక్ మీదుగా కలెక్టరేట్ కు చేరుకుంది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమగ్ర ఓటర్ జాబితాను తయారుచేయడానికి ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓటర్ నమోదు పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని, అందులో భాగంగా నే పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ జులై 15 లోపు బి ఎల్ ఓ లు, తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించి ఫారం-6 ద్వారా ఓటరు నమోదు చేసుకోవాలని, చనిపోయిన లేదా చిరునామా తొలగింపుకు ఫారం-7, మార్పులు, చేర్పులకు ఫారం -8 పూర్తి చేసి సరిచేసుకోవచ్చని తెలిపారు. కుటుంబ సభ్యుల ఓటు హక్కు వివరాలను పోర్టల్ లో ఎపిక్ నంబర్ ద్వారా వివరాలను పరిశీలించుకోవాలని, సాంకేతిక, ఇతర కారణాల వలన ఓటు హక్కు తొలగించబడినట్లైతే జులై 15 లోగా ఫారం -6 సమర్పించి నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి డిఆర్ఓ అరవింద్ కుమార్, జిల్లా యువజన, క్రీడా సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు నలంద ప్రియ, కలెక్టరేట్ పర్యవేక్షకులు స్వాతి, రాజేశ్వర్, రవి, యువకులు, మాజీ సైనికులు, పోలీస్, ఇతర అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.