ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.

ఆదిలాబాద్: ప్ర‌త్యేక రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. గురువారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక తెలంగాణ చౌక్ సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద జిల్లా కలెక్టర్, స్థానిక శాసన సభ్యులు జోగు రామన్న, ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి, అమరవీరుల కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం రెండు నిముషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరులను ఎన్నటికీ మరువలేమన్నారు. ఎందరో త్యాగధనుల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని వారి జ్ఞాపకార్థం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. జూన్ 2 నుండి 22 వరకు 21 రోజుల పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేశారని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన అమరుల కుటుంబ సభ్యులను ప్రతి సంవత్సరం సత్కరించి గౌరవించుకుంటున్నామన్నారు. ఇదే స్పూర్తితో జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు. ఆదిలాబాదు శాసన సభ్యులు మాట్లాడుతూ, అమరుల త్యాగాలు వెలకట్టలేమని, వారి త్యాగఫలం తోనే తెలంగాణ సాధించుకున్నామన్నారు. జిల్లాలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా యంత్రాంగానికి, పోలీస్, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ప్రజలు, ప్రజాప్రతినిధులు, కవులు, కళాకారులకు ఎమ్యెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో అమరవీరుల ప్రాణ త్యాగాలు తెలంగాణ ఏర్పాటులో ముఖ్య భూమిక వహించాయని, శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య లాంటి అమరవీరుల త్యాగాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలం అన్నారు. జూన్ 2, ఆగస్టు 15, జనవరి 26 న అమరవీరులను స్మరించుకుంటున్నామని అన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను కలెక్టర్ శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాడిన పాటలు అమరుల త్యాగాలను గుర్తుచేసేలా సాగాయి.

Leave A Reply

Your email address will not be published.