ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్

పట్టణ ప్రగతితో పట్టణ ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి అభివృద్ధి పరిచిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మున్సిపాల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి దినోత్సవాన్ని స్థానిక డైట్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం నాడు – నేడు పట్టణంలో జరిగిన అభివృద్ధి, నిధులు, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, పచ్చదనంతో గణనీయంగా మెరుగుపడిన తీరు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా పట్టణ ప్రజలకు జరిగిన లబ్ధిని మున్సిపల్ కమిషనర్ శైలజ సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత వివిధ శాఖలలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల ఘనంగా నిర్వహిస్తున్నదని, అందులో భాగంగా ఈ రోజు పట్టణ ప్రగతి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వార్డులో మౌళిక సదుపాయాలు, వసతులు కల్పించేందుకు పట్టణ ప్రగతిలో భాగంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, మున్సిపాలిటీ పరిధిలో మిషన్ భగీరథ క్రింద ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తున్నామని అన్నారు. ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను వేరువేరుగా 72 వాహనాలతో సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించడం జరుగుతుందని, బంగారిగూడలో 36 ఎకరాలలో కంపోస్ట్ షెడ్ ఏర్పాటు చేశామన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. హరిత పట్టణం సాధన దిశగా మున్సిపాలిటికి 10 శాతం గ్రీన్ బడ్జెట్ కేటాయిస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.